అడ్డొస్తున్నాడని అంతమొందించారు
- ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య
- పోలీసుల విచారణలో అంగీకరించిన నిందితురాలు
- విషయం తెలిసి ప్రియుడ్ని చెట్టుకు కట్టేసిన తండావాసులు
- ఆపై పోలీసులకు పట్టిచ్చిన వైనం
భర్త ఉండగానే ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శాశ్వతంగా అతని అడ్డు తొలగించుకుంటే తమకు ప్రశ్నించే వారే ఉండరనుకున్న ఆమె ప్రియుడితో కలసి పథకం రచించింది. వారిద్దరూ కలసి మరో ఇద్దరి సహకారంతో అమాయకుడ్ని చంపేశారు. ఆ తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైనా.. చివరకు పోలీసులకు ఆమె దొరికిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ప్రియుడ్ని తండావాసులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఎస్‌ఐ వజ్రముని కథనం ప్రకారం...
జరిగిందేమిటంటే...
పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్దతండాకు చెందిన కె.యుగంధర్(28), మంజుల దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి నాలుగేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ అదే తండాకు చెందిన ఆంజనేయులు నాయక్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం యుగంధర్‌కు తెలిసి భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన అతను ఇక ఆమెను ఏమీ అనలేకపోయాడు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆమె భర్త అడ్డు తొలగించుకుంటే శాశ్వతంగా తాము మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని భావించారు. ఇదే విషయం ఆమె ప్రియుడితో చెప్పింది. తమ పథకాన్ని మరో ఇద్దరికి తెలిపి వారి సహకారంతో రెండ్రోజుల కి ందట యుగంధర్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. ఆ తరువాత మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టేసి ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో పడేశారు. హతుడి భార్య మంజులను శనివారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, ఆంజనేయులు నాయక్ సహా మరో ఇద్దరితో కలసి హత్య చేసినట్లు అంగీకరించింది.
పోలీసుల సమాచారంతో...
విచారణలో భాగంగా ఆంజనేయులు నాయక్ ఆచూకీ తెలుసుకునే క్రమంలో పోలీసులు పెడబల్లి తండా వాసులకు ఫోన్ చేసి ఆంజనేయులు నాయక్ చేసిన ఘనకార్యం గురించి వివరించారు. ఈ విషయం క్షణాల్లో తండా యావత్తూ తెలిసిపోవడంతో ఊరంతా ఒక్కటై నిందితుడు ఆంజనేయులు నాయక్ పరారు కాకుండా, అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆ తరువాత కర్ణాటక పోలీసులు రాగానే వారికి పట్టిచ్చారు. వందలాది మంది గ్రామస్తులు చుట్టుముట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది.