Wifes murder
-
అడ్డొస్తున్నాడని అంతమొందించారు
ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన భార్య పోలీసుల విచారణలో అంగీకరించిన నిందితురాలు విషయం తెలిసి ప్రియుడ్ని చెట్టుకు కట్టేసిన తండావాసులు ఆపై పోలీసులకు పట్టిచ్చిన వైనం భర్త ఉండగానే ఆమె మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శాశ్వతంగా అతని అడ్డు తొలగించుకుంటే తమకు ప్రశ్నించే వారే ఉండరనుకున్న ఆమె ప్రియుడితో కలసి పథకం రచించింది. వారిద్దరూ కలసి మరో ఇద్దరి సహకారంతో అమాయకుడ్ని చంపేశారు. ఆ తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైనా.. చివరకు పోలీసులకు ఆమె దొరికిపోయింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు ప్రియుడ్ని తండావాసులు చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. కర్ణాటకకు చెందిన ఎస్ఐ వజ్రముని కథనం ప్రకారం... జరిగిందేమిటంటే... పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్దతండాకు చెందిన కె.యుగంధర్(28), మంజుల దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలసి నాలుగేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లారు. అక్కడ అదే తండాకు చెందిన ఆంజనేయులు నాయక్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం యుగంధర్‌కు తెలిసి భార్యను మందలించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన అతను ఇక ఆమెను ఏమీ అనలేకపోయాడు. దీన్ని అలుసుగా తీసుకున్న ఆమె భర్త అడ్డు తొలగించుకుంటే శాశ్వతంగా తాము మరింత స్వేచ్ఛగా ఉండొచ్చని భావించారు. ఇదే విషయం ఆమె ప్రియుడితో చెప్పింది. తమ పథకాన్ని మరో ఇద్దరికి తెలిపి వారి సహకారంతో రెండ్రోజుల కి ందట యుగంధర్‌ను ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. ఆ తరువాత మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టేసి ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో పడేశారు. హతుడి భార్య మంజులను శనివారం ఉదయం అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, ఆంజనేయులు నాయక్ సహా మరో ఇద్దరితో కలసి హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసుల సమాచారంతో... విచారణలో భాగంగా ఆంజనేయులు నాయక్ ఆచూకీ తెలుసుకునే క్రమంలో పోలీసులు పెడబల్లి తండా వాసులకు ఫోన్ చేసి ఆంజనేయులు నాయక్ చేసిన ఘనకార్యం గురించి వివరించారు. ఈ విషయం క్షణాల్లో తండా యావత్తూ తెలిసిపోవడంతో ఊరంతా ఒక్కటై నిందితుడు ఆంజనేయులు నాయక్ పరారు కాకుండా, అతన్ని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. ఆ తరువాత కర్ణాటక పోలీసులు రాగానే వారికి పట్టిచ్చారు. వందలాది మంది గ్రామస్తులు చుట్టుముట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
మార్కాపురం (ప్రకాశం) : మద్యం మత్తులో భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్తకు యావజ్జీవ ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ముమ్మడివరం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్, సువార్త(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన ఇజ్రాయిల్ 2011 నవంబర్ 16న పూటుగా తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి విపరీతంగా కొట్టాడు. అతని నుంచి విడిపించుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో.. గొంతు నులిమి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా పూర్తి విచారణ అనంతరం నేరం నిరూపించబడటంతో సోమవారం జిల్లా ఆరో అదనపు న్యాయమూర్తి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. -
భార్య హత్య.. భర్తకు జీవిత ఖైదు
చెన్నై: భార్యను హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తకు ఎరోడ్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి.. రంగానాథన్(50) ఓ పండ్ల వ్యాపారి. అయితే, భార్యపై అనుమానం పెంచుకున్న రంగనాథన్ తరచుగా ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గతేడాది జూన్ 25న భార్యతో గొడవకు దిగిన భర్త, నైలాన్ తాడును ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. తన తల్లిని, తండ్రే హత్య చేశాడని కూతురు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.మంగళవారం నాడు ఎరోడ్ జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ ఎన్ తిరునవుక్కరసు ఎదుట హాజరు పరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్.. భార్యను హత్య చేసిన రంగనాథన్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించారు. -
అనుమానంతో అఘాయిత్యం
ఉప్పల్, న్యూస్‌లైన్: అనుమానం పెనుభూతమైంది... కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను పెరోల్‌పై బయటకు వచ్చి భార్యను అతికిరాతకంగా పొడిచి చంపి పారిపోయాడు. రామంతాపూర్ గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఎస్. వీరు (36) చార్మినార్‌లో ట్రైలరింగ్ పని చేసేవాడు. 12 ఏళ్ల క్రితం అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే సంగీతను ప్రేమించాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈకేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు.. తనపై కేసులు ఎత్తేశారని నమ్మబలికి రామంతాపూర్ గాంధీనగర్‌కు చెందిన బసంతి కూతురు నందిని(30)ను 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు ధనుష్ (8) సంతానం. అనంతరం ప్రియరాలి హత్య కేసులో వీరుకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్త జైలుకు వెళ్లినప్పటి నుంచి నందిని అమ్మగారి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ.. దుస్తుల షాపులో పని చేస్తూ జీవిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఈనెల 3న పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన వీరు భార్య వద్దే ఉంటున్నాడు. ఇంటికి వచ్చిన రోజు నుంచి అనుమానంతో ఆమెతో గొడవ పడుతున్నాడు. కుమారుడు చదువుతున్న పాఠశాలకు వెళ్లి.. తన కొడుకును తీసుకుపోతానని పలుమార్లు గొడవపడ్డాడు. ఇదిలా ఉండగా, సోమవారం మధ్యాహ్నం నందిని భోజనం చేస్తుండగా ఇంటికి వచ్చిన వీరు ఆమెతో గొడవకు దిగాడు. అప్పటికే భార్యపై అనుమానం పెంచుకున్న వీరు.. తన వెంట తెచ్చుకున్న కత్తితో కడుపు, ఛాతి, కాళ్లపై విచక్షణారహితంగా పొడిచాడు. అదే సమయంలో ఇంటికి చేరుకున్న కుమారుడు తల్లిపై దాడిని అడ్డుకోబోగా అతడిని కూడా కత్తితో గాయపర్చి పారిపోయాడు. వెంటనే ధనుష్ పక్కనే ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి.. ఆమెను తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న నందినిని రామంతాపూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందని హత్యతో గాంధీనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.