
అనుమానం పెనుభూతమై..
భార్యను బండతో కొట్టి చంపిన భర్త
గంపలగూడెం (తిరువూరు) : వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన మండలంలోని పెనుగొలనులో సోమవారం జరిగింది. ఘటనపై మృతురాలి తల్లి దుబ్బాకు నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇనపనూరి లక్ష్మణ్ తన భార్య కమలకుమారి (27)ని పచ్చడిబండతో బలంగా కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శివరామకృష్ణ సంఘటన వివరాలు తెలిపారు.
విస్సన్నపేట మండల పుట్రేలకు చెందిన తన అక్క కుమార్తె కమలకుమారిని లక్ష్మణ్ పన్నెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. అనుమానంతో లక్ష్మణ్ రోజూ తన భార్యను వేధించేవాడు. పెద్ద మనషులు మందలించినా మార్పు రాలేదు. వేధింపులు తాళలేక ఏడాది కిందట కుమారి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి తొమ్మిది నెలల కిందట పెనుగొలను వచ్చింది. కొన్నిరోజులుగా మళ్లీ తన కూతురుని వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో సోమవారం లక్ష్మణ్ అతని అన్న సర్వేశ్వరరావు సహకారంతో కమలకుమారిని హత్యచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.