
సెల్‌ఫోన్‌లో వేధిస్తోందని యువతిపై ఫిర్యాదు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): ఓ యువతి సెల్‌ఫోన్‌లో తనను వేధిస్తున్నదని ఓ యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.జూబ్లీహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే సతీష్ అనే యువ వ్యాపారికి గత రెండేళ్లుగా ఫోన్‌లో నెట్‌కాలింగ్ ద్వారా అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఫోన్లు వస్తున్నాయి.
డబ్బులు ఇవ్వాలంటూ లేకపోతే పరువు తీస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్న యువతిని మీరెవరంటూ ఎన్నిసార్లు ప్రశ్నించినా సరైన సమాధానం ఉండేది కాదు. దీంతో సతీష్ ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించడంతో సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.