
ఫ్యాన్సీ నంబర్.. ధర సూపర్!
వేలంలో 9999 నంబరు దక్కించుకున్న మహిళ
సాక్షి, మలక్‌పేట(హైదరాబాద్): మూసారంబాగ్‌లోని ఈస్ట్‌జోన్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లకు నిర్వహించిన వేలం పాటలో ఓ మహిళ టీఎస్ 11ఈకే 9999 నంబరును రూ. 2,50,285 లక్షలకు దక్కించుకున్నారని ఆర్టీఏ మొహిమిన్ తెలిపారు. గడ్డిఅన్నారానికి చెందిన జి. ప్రత్యుషరెడ్డి హోండా అమేజ్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు ఫ్యాన్సీ నంబర్ (టీఎస్ 11ఈకే 9999) కోసం ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అయితే, ఇదే నెంబర్‌కు కోసం మరో నలుగురు పోటీ పడటంతో ఆర్టీఏ అధికారులు సోమవారం వేలం పాట నిర్వహించగా.. 2,50,285కు ప్రత్యుషరెడ్డి సొంతం చేసుకున్నారు. వాహనదారులు ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పడుతుండటంతో రవాణాకు శాఖకు ఆదాయం పెరుగుతోంది.
అ‘ధర’హో..
ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కొన్ని నంబర్లకు ఊహించని ధర దక్కింది. టీఎస్ 09 ఈఎస్ 9999 నంబరు ఏకంగా రూ.10 లక్షలు పలికింది. రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారు కోసం హెట్రో డ్రగ్స్ ప్రతినిధులు ఈ నంబరు దక్కించుకున్నారు.
టీఎస్ 09 ఈఎస్ 0099 నెంబరును రూ. 1.93 లక్షలకు సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్లు పాడుకున్నారు. రూ. 4.49 కోట్లతో కొన్న ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు ఈ నంబర్ పొందారు. టీఎస్ 09 ఈఎస్ 0009 నంబరుకు రూ. 1.73 లక్షల ధర పలికింది. ఇంటర్ కాంటినెంటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తాము రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు ఈ నంబరు తీసుకుంది. ఇక టీఎస్ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పాడుకుంది. రూ. 1.28 కోట్లతో కొన్న బెంజ్ ఎస్350 సీడీఐ కారుకు ఈ నంబరు పొందారు.