వి.కోట మండలం పాతూరు వద్ద వేరుశనగ పంటను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- రాష్ట్ర ప్రజలే నా హైకమాండ్
- తెల్సుకోకుండా మాట్లాడితే ఎలా?
- 2018లోగా పూర్తి చేస్తామంటే పోలవరాన్ని కేంద్రానికి ఇస్తాం
- అనంత, చిత్తూరు జిల్లాల్లో 24 గంటలూ వ్యవసాయానికి విద్యుత్తు
- ఒక్క ఎకరం ఎండనివ్వం.. నియోజకవర్గానికో ఐఏఎస్ అధికారి
- వీ. కోట బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/ వీ. కోట : ‘నేనెవ్వరికీ భయపడను.. ప్రజలకు తప్ప. రాష్ట్ర ప్రజలే నా హైకమాండ్. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి భయపడే ప్రసక్తే లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా వీ.కోట మండలంలో పర్యటించిన ఆయన రెయిన్ గన్స్‌తో సాగులో ఉన్న వివిధ రకాల పంటలను పరిశీలించారు. అనంతరం వీ.కోట బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాను ఇప్పటికి 23సార్లు ఢిల్లీ వెళ్లి హోదా గురించి అడిగానన్నారు. తాను ప్రయత్నం చేయడం లేదనీ, భయంతో వెనుకంజ వేస్తున్నాననడం తప్పన్నారు. నా గురించి సరిగ్గా తెల్సుకోవాలని పరోక్షంగా పవన్ కల్యాణ్‌కు సూచించారు. తనకు వీపీ సింగ్ హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేపథ్యం ఉందన్నారు. 2018లోగా పూర్తి చేస్తామంటే పోలవరాన్ని కేంద్రానికి ఇస్తామన్నారు. వచ్చే డిసెంబరులోగా హంద్రీ–నీవా పనులుపూర్తి చేసి కుప్పం, పలమనేరు ప్రాంతాలకు నీరందిస్తామన్నారు. అనంతపురం జిల్లాలో 6 లక్షలు, చిత్తూరు జిల్లాలో 1.30 లక్షల ఎకరాల వేరు శెనగ ఎండుముఖం పట్టిందనీ, దీన్ని నివారించేందుకు రెయిన్ గన్ల వాడకాన్ని పోత్సహిస్తున్నామన్నారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్క ఎకరం పంట కూడా ఎండనీయమన్నారు. అవసరమైతే కరువు తాండవిస్తోన్న నియోజకవర్గాలకు ఒక్కో ఐఏఎస్, రెండేసి మండలాలకు ఒక్కో గ్రూప్–1 అధికారులను ఇన్‌చార్జులుగా నియమించి పంటలను పర్యవేక్షిస్తామన్నారు. ఈ రెండు జిల్లాల్లోనూ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. చిత్తూరు ప్రాంతంలో పండించే కూరగాయలు, పండ్లను నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేలా ఫార్మర్స్ ప్రొడక్షన్ సంస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో వినియోగించే ఎల్‌ఈడీ సిస్టమ్ పర్యవేక్షణ కోసం విజయవాడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రి నారాయణ, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.