దెయ్యమై పీడిస్తా | Plus Two Student Letter To CM For Alcohol Ban Before Suicide | Sakshi
Sakshi News home page

దెయ్యమై పీడిస్తా

Published Thu, May 3 2018 8:59 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Plus Two Student Letter To CM  For Alcohol Ban Before Suicide - Sakshi

ఉరికి వేలాడుతున్న యువకుడు–సీఎంకు రాసిన సూసైడ్‌నోట్‌ (ఇన్‌సెట్‌లో దినేష్‌ (ఫైల్‌)

పేదింటి వాడైనా డాక్టరు కావాలని పెద్ద కలలు కన్నాడు. కన్న తల్లిప్రేమకు దూరమైనా చదువుల తల్లికి దగ్గరయ్యాడు. ప్లస్‌టూ పరీక్షలు రాసి నీట్‌ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం ద్వారా డాక్టర్‌ కావాలనే తన కలను సాకారం చేసుకోవాలనిభావించాడు. అయితే తండ్రి మద్యం వ్యసనం అతడి ఆశలపై నీళ్లు చల్లింది. మద్యం అమ్మకాలు, దాని వల్ల కుటుంబాల్లో చోటుచేసుకునే అరిష్టాలు ఆ బాలుని సున్నితమైన హృదయాన్ని చిదిమేశాయి. జీవితంపై ఏర్పడిన విరక్తి బలవన్మరణానికి ప్రేరేపించింది. రాష్ట్రంలో మద్యనిషేధం విధించకుంటే దెయ్యమై పీడిస్తానంటూ ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిఉరివేసుకునేలా చేసింది. దయనీయమైన ఈఘటన తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తిరునెల్వేలి జిల్లా పాలయంగోట్టై దక్షిణం నగరరోడ్డులో ప్రజలు ప్రతిరోజూ వాకింగ్‌ చేస్తుంటారు. బుధవారం ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు అక్కడి రైల్వేట్రాక్‌ వంతెనకు ఒక బాలుడు స్కూల్‌ బ్యాగ్‌ తగిలించుకుని ఉరివేసుకుని వేలాడుతుండగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బ్యాగును తనిఖీ చేయగా కే రెడ్డియపట్టికి చెందిన దినేష్‌ (17) అనే ప్లస్‌టూ విద్యార్థిగా గుర్తించారు. ప్లస్‌ టూ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తూ నీట్‌ ప్రవేశపరీక్షకు సిద్ధం అవుతున్నాడు. బాలుని బ్యాగులో నీట్‌ హాల్‌ టిక్కెట్, ఒక సూసైడ్‌ నోట్‌ దొరికింది. పోలీసుల విచారణలో దయనీయమైన విషయాలు వెలుగుచూశాయి.

తండ్రి మాడస్వామి ప్రతిరోజూ మద్యం తాగి బాలుడిని వేధించడం వల్ల వైద్య విద్య అభ్యసించాలన్న దినేష్‌ కలలకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు తండ్రి బలహీనతల వల్ల కుటుంబ సమస్యలు పెరిగిపోయాయి. మద్యం మానివేసి ఆ డబ్బుతో నన్ను డాక్టర్‌ చదివించు, మద్యం మానకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తరచూ తండ్రితో అనేవాడు. అయినా కుమారుడి మాటలను తండ్రి లక్ష్యపెట్టలేదు. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న దినేష్‌ మంగళవారం అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. బుధవారం తెల్లారేసరికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాడస్వామి భార్య పాపమ్మాళ్‌ 9 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించడంతో కేరళకు చెందిన మహిళను రెండో వివాహం చేసుకుని, మొదటిభార్య సంతానమైన దినేష్‌ (17), ఇసక్కిరాజ్‌ (13), ధనుశ్రీ (11)లతో ఉంటున్నాడు.

దయ్యమై పీడిస్తా
అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామిని ఉద్దేశించి మరో ఉత్తరం రాసి ఉన్నాడు. ‘మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రంలో రోజురోజుకూ చావులు పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో వాహన ప్రమాదాల సంఖ్యలో దేశం మొత్తం మీద తమిళనాడే ప్రథమ స్థానంలో ఉంది. ఆదాయం పోతుందనే భావనతో మద్యం దుకాణాలు మూసేందుకు నిరాకరించిన పక్షంలో దెయ్యంగా మారి ప్రతీకారం తీర్చుకుంటాను. భారత ప్రధాని, తమిళనాడు సీఎం ఇకనైనా మద్యం దుకాణాలు మూస్తారేమో చూస్తా. లేకుంటే నేను దెయ్యంగా మారి టాస్మాక్‌ దుకాణాలను ధ్వంసం చేస్తాను’ అని పేర్కొని ఉన్నాడు. దినేష్‌ ఆత్మహత్యచేసుకున్న ప్రాంతంలోనే టాస్మాక్‌ దుకాణం ఉండడం గమనార్హం.బాలుడు దినేష్‌ తన పాకెట్‌ డైరీలో తన పేరుకు ముందువైపు డాక్టర్‌ చివరన ఎంబీబీఎస్, ఎండీ పేర్కొని ఉన్నాడు. డాక్టర్‌ కావాలనే తనకలను సాకారం చేసుకునే ప్రయత్నంలో నీట్‌ ప్రవేశపరీక్ష సిద్ధమైనాడు. మరో నాలుగు రోజుల్లో పరీక్ష రాయాల్సి ఉండగా మద్యానికి బానిసైన తండ్రితో విసిగిపోయి దయనీయంగా తనవుచాలించాడు.

ప్రభుత్వం కళ్లు తెరవాలి
బాలుడు దినేష్‌ ఆత్మహత్య ఉదంతంతోనైనా ప్రభుత్వం కళ్లుతెరిచి మద్య నిషేధం విధించాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ కోరారు. తిరుచ్చిరాపల్లిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ, మద్యానికి బానిసలైన వారి వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. పూటుగా మద్యం సేవించి తల్లిని చిత్రహింసలు పెట్టే తండ్రులను చూసి పిల్లలు బెదిరిపోతున్నారని తెలిపారు. అంతేగాక తండ్రితోపాటూ పిల్లలు కూడా మద్యానికి బానిసలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా, మూతపడ్డ 1300 టాస్మాక్‌ దుకాణాల్లోని ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించని పక్షంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేసి ఆందోళన చేపడతామని తమిళనాడు టాస్మాక్‌ అమ్మకందారుల సంఘం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

హృదయవిదారక ఉత్తరం
బలవన్మరణానికి పాల్పడే ముందు దినేష్‌ తన తండ్రి, ముఖ్యమంత్రి ఎడపాడిని ఉద్దేశించి హృదయ విదారక ఉత్తరం రాయడం అందరినీ కంటతడి పెట్టించింది. ‘నాన్నా.. నేను చనిపోయిన తరువాతైనా మద్యం తాగడం మానివేయి, తాగేట్లుగా ఉంటే నా తలకొరివి పెట్టవద్దు, దహన సంస్కారాలు చేసి గుండుకొట్టించుకోవద్దు. అంత్యక్రియలు నిర్వహించవద్దు. చిన్నాన్న మణి అన్నీ చేస్తాడు. అదే నా చివరి కోరిక. నాన్నా.. ఇకనైనా తాగడం మానివేయి, అప్పుడే నా ఆత్మశాంతిస్తుంది’ అంటూ అభ్యర్థించాడు. ఉత్తరంలో తండ్రి, చిన్నాన్న, మామల సెల్‌ఫోన్‌ నంబర్లను రాసిపెట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement