తానూరు : మంచి మానవత్వం మనుషులకే సొంతం. వీటిని దూరం చేసేది మద్యం. మనుషులకి పశు ప్రవృత్తిని చొప్పించి వివేకం, విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అలాంటి మద్యానికి దూరంగా ఉండేందుకు జిల్లాలోని మారుమూల తానూరు మండలంలోని మహాలింగి గ్రామస్తులు ముందుకు వచ్చారు. ఒకే మాట మీద నిలిచారు. మద్యపానాన్ని నిషేధించాలని దసరా పండుగ రోజు నిర్ణయించి గ్రామ పెద్దల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అప్పటి నుంచి గ్రామంలో ఎవరైనా మద్యపానం సేవిస్తే జరిమానా విధిస్తున్నారు.
అంతా ఐక్యతతో..
మండల కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని మహాలింగిలో గ్రామస్తులంతా ఐక్యతతో మద్యపానాన్ని నిషేధించేందుకు ముందుకు వచ్చారు. వీరికి తోడు డ్వాక్రా మహిళలు నడుం బిగించారు. గ్రామస్తుల సహకారంతో నెల రోజులుగా గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. కొన్నేళ్లుగా గ్రామంలో మద్యానికి బానిసైన యువకులు ఇంటి బాగోగులకు చూసుకోకుండా జులాయిగా తిరుగుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఏడాదిలో మద్యానికి బానిసైన 50 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. పిల్లలు, అనాథలవడమే కాకుండా చదువులకు దూరమవుతున్నారు. ఇదంతా గమనించిన గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు ఈ నిర్ణయానికి వచ్చారు. మద్యం తాగిన వారిని గ్రామంలోకి రానివ్వరు. పైగా జరిమానా విధిస్తారు. దీంతో నెల రోజులుగా గ్రామస్తులెవరూ మద్యం ముట్టుకోవడం లేదు.
పోలీసుల సహకారంతో..
గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని ముందుగా గ్రామస్తులు తీర్మానించారు. గ్రామంలో మద్యాన్ని ఎవరూ అమ్మరాదని, అమ్మితే వారికి జరిమానా విధిస్తామని నిర్ణయించారు. గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని కోరుతూ భైంసా డీఎస్పీ రావుల గిరిధర్‌ను గ్రామ మహిళలు కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన ఆయన గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా చర్య తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఒకే మాట.. ఒకే బాట
Published Sun, Nov 9 2014 3:47 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement