వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఏకపక్షమైతే రాష్ట్ర మంత్రులంతా పరిపాలనను గాలికి వదిలి ఎందుకు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు.
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఏకపక్షమైతే రాష్ట్ర మంత్రులంతా పరిపాలనను గాలికి వదిలి ఎందుకు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన మోసంతో అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వెల్లువెత్తుతున్నదన్నారు.
వరంగల్‌లో మంత్రులు, అధికారపార్టీ నేతలు ఎక్కడికి వెళ్లినా నిలదీస్తున్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేకతకు భయపడిన టీఆర్‌ఎస్ వరంగల్‌లో ఓడిపోతామనే భయంతో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా మంత్రులు వ్యవహరిస్తున్నారని గుత్తా విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు గెలుస్తామనే నమ్మకం ఉంటే మంత్రులను వెనక్కి రప్పించాలని సవాల్ చేశారు. పెరిగిన ప్రజా వ్యతిరేకత వల్ల ఓడిపోతామనే భయంతోనే మంత్రులంతా పరిపాలనను వదిలిపెట్టి, సచివాలయంలోకి రాకుండా వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని గుత్తా విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదిన్నరగా పట్టించుకోకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బీసీలకు కళ్యాణలక్ష్మీ పథకం వర్తింపజేస్తామని, పోలీసు నోటిఫికేషన్లు ఇస్తామని, మహిళలకు తగిన రిజర్వేషన్లు ఇస్తామని వరంగల్ ఎన్నికలకోసం మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
క్లబ్‌లు, గుళ్లు, మసీదులు, చర్చిల్లో కూడా మంత్రులు స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారని అన్నారు. గెలుస్తామనే నమ్మకం ఉంటే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా ప్రచారంచేయాల్సిన అవసరం ఏమిటని గుత్తా ప్రశ్నించారు. మంత్రులు చేస్తున్న ప్రకటనలను, టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటనలు, ఆదాయం పొందుతున్న మీడియా సంస్థలు చేస్తున్న దుర్వినియోగాన్ని పార్లమెంటులో ప్రశ్నిస్తానని గుత్తా హెచ్చరించారు.