- నీటి పారుదల శాఖలో రూ.8 కోట్లకు ప్రతిపాదనలు
- నీరు విడుదల చేయకుండా స్వప్రయోజనాలకు పెద్దపీట
- అధికారపార్టీ నాయకుల తీరుపై ఆశ్చర్యపోతున్న రైతులు
- ఐఏబీ సమావేశం నిర్వహించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక
ఓరి దేవుడా..ఎందుకీ పనులు!
Published Wed, Oct 19 2016 2:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఓ వైపు ఐఏబీ సమావేశంపై గందరగోళం నెలకొని ఉండగా, మరోవైపు రూ.8 కోట్లు ఓ అండ్ ఎం పనులకు అధికారపార్టీలోని ఓ వర్గం ప్రతిపాదనలు తెచ్చారు. ఈ ప్రతిపాదనలను మరో వర్గం వ్యతిరేకించడంతో విషయం బయటకు పొక్కింది. నీటి విడుదల మరచి స్వప్రయోజనాలకు పాకులాడుతున్న వైనంపై రైతులు మండిపడుతున్నారు. పకడ్బందీగా నీటి పంపిణీ చేయాలంటే కాలవల మరమ్మతులు ఎంతో ముఖ్యం. గత ఐఏబీ సమావేశంలో రూ.7 కోట్లతో ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్) పనులు చేపట్టాలని తీర్మానించారు. ఈ నిధులతో కాలువల మరమ్మతులు చేపట్టారు. అయితే అవి పూర్తి కాక ముందే నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో నీరు వృధా అయింది. పనుల్లో అక్రమాలదే పైచేయి అయింది. ఇదిలా ఉంటే, గత ఐఏబీ తీర్మానం ప్రకారం చేసిన ఓ అండ్ ఎం పనులకు సంబంధించి రూ.7 కోట్ల బిల్లులు తమకు చెల్లించలేదని కాంట్రాక్టర్లు చెప్పుకొస్తున్నారు.
అవసరం లేకున్నా..
తాజాగా జలాశయంలోని నీటితో పనిలేకుండా కేవలం పనుల కోసమే టీడీపీలోని ఓ వర్గం పట్టుబడుతోంది. దీనిని అధికార పార్టీ నాయకులే తప్పుబడుతున్నారు. నాలుగైదు నెలల వ్యవధిలో కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ అవసరాలను తెలుసుకుని ఓ అండ్ ఎం ప్రతిపాదనలు రూపొందించకుండా స్వాహానే లక్ష్యంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారాయణ చెప్పినట్లు ఐఏబీ సమావేశం తేదీ నిర్ణయించాలంటే జలాశయానికి సుమారు 50 టీఎంసీల నీరు చేరాల్సి ఉంది. ఇన్‌చార్జి మంత్రి , ఎమ్మెల్సీలు ప్రకటించినట్లు 20వ తేదీన మీటింగ్ జరగాలంటే కృష్ణానది నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే కృష్ణాజలాలను విడుదల చేసే ప్రసక్తి లేదని రాష్ట్ర స్థాయి అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పనులను తెచ్చుకోవడమా లేక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఏబీ నిర్వహించాలా? అన్న మీమాంస అందరి మెదళ్లను తొలుస్తోంది.
విచారణ ఏమైనట్లు?
నీటి పారుదల శాఖలో నీరు –చెట్టు, ఎఫ్‌డీఆర్, సీఈ మంజూరులు, ఒకే పనికి మూడు బిల్లులు తదితరాలపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పందించిన కలెక్టర్ నీరు–చెట్టు 2 కు సంబంధించి సుమారు రూ.87 కోట్ల బిల్లులను కలెక్టర్ ముత్యాలరాజు ఆపేశారు. నీటి పారుదల శాఖ పనులపై విచారణకు ఆదేశించారు. నలుగురు ప్రత్యేకాధికారులను విచారణకు పురమాయించారు. ఆ అధికారుల పరిశీలనలు ఎంత వరకు వచ్చాయో ఎవరికీ అంతుబట్టడంలేదు. దీనికి తోడు కడప క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ, ఈఈలు ఎవరికి వారు విచారణ చేస్తూనే ఉన్నట్లు సమాచారం. కోవూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కావలి ఈఈని నియమించారు. ఆ పరిశీలనలకు సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు. కేవలం విడవలూరు ఏఈని సరెండర్ చేసి చేతులు దులుపుకున్నారు. అవినీతి,ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపే స్వేచ్ఛ అధికారులకు లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు బయటకు రాలేదని రైతులు విమర్శిస్తున్నారు. పనులపై నిష్పక్షపాత విచారణ జరిగి ఉంటే అధికారపార్టీ నాయకులు రైతు ప్రయోజనాలు మరచి ఓ అండ్ ఎం పనుల కోసంఽ కొత్తగా ముందుకు వచ్చి ఉండేవారు కాదని రైతులంటున్నారు. అధికారపార్టీ నాయకుల కుమ్ములాటల వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఓ అండ్ ఎం పనులను ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. అయితే గత ఓ అండ్ ఎం పనుల బిల్లులే మంజూరు కాకపోవడంతో ఈ పనులను నీరు–చెట్టు కింద చూపాలని అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఐఏబీని నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని, ఇది అధికారపార్టీ నాయకుల మధ్య అంతర్యుద్ధానికి దారితీసిందని సమాచారం.
20న సమావేశం నిర్వహించకుంటే ఉద్యమం
పంటలకు అనుకూలమైన డెల్టా ప్రాంతానికి మొదట నీటిని అందించేందుకు పార్టీలకతీతంగా కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. నీటి పంపిణీలో అలసత్వం వహించి జిల్లా రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఓ అండ్ ఎం పనుల పందేరాన్ని పక్కన పెట్టాలని, ఈ నెల 20వ తేదీ లోగా ఐఏబీ నిర్వహించి నీటి విడుదల వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమిస్తామంటున్నారు.
Advertisement
Advertisement