హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌ | in murder case 6 persons arrest | Sakshi
Sakshi News home page

హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌

Published Tue, Jul 19 2016 9:50 PM | Last Updated on Fri, May 25 2018 5:59 PM

హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌ - Sakshi

హత్యకేసులో ఆరుగురి అరెస్ట్‌

జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం మండలం మర్లగూడెం సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన గిరిజనుడు పొట్టం సింగరాజు (టైలర్‌ రాజు) దారుణ హత్యకేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పోలీస్‌స్టేçÙన్‌లో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న రాత్రి పొట్టం సింగరాజును జంగారెడ్డిగూడేనికి చెందిన సుంకర పవన్‌కుమార్‌ అలియాస్‌ చిన్న అలియాస్‌ ఎస్‌కే సలీం, ముక్కు శ్రీను, అంబటి అజయ్, షేక్‌ బాషా, తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీ తీవ్రంగా కొట్టి హత్యచేశారు. వీరు ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

మద్యం మత్తులో మట్టుపెట్టారు
స్థానిక జేపీ సెంటర్‌ బ్రాందీ షాపు సమీపంలోని ఖాళీ ప్రాంతంలో ఈ నెల 16న రాత్రి టైలర్‌ రాజు మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో తగరం అజయ్‌కుమార్‌కు చెందిన ఆటోలో సుంకర పవన్‌కుమార్, ముక్కు శ్రీను, అంబటి అజయ్, షేక్‌ బాషా, తగరం అజయ్‌కుమార్, ఉసిరిక బాలాజీ మద్యం సేవించేందుకు ఇక్కడకు వచ్చారు. ఆ సమయంలో టైలర్‌ రాజుకు వీరికీ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన నిందితులు టైలర్‌ రాజును తీవ్రంగా కొట్టి ఆటోలో ఎక్కించుకుని మర్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ చెట్ల కొమ్మలతో టైలర్‌ రాజును గాయపర్చారు. దీంతో టైలర్‌ రాజు మృతిచెందాడు. నిందితులు వినియోగించిన ఆటో, ఒక కత్తి, ఐరన్‌రాడ్డు, కర్రలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్టు డీఎస్పీ తెలిపారు .

హతుడిని గుర్తించింది ఇలా..
హతుడు రాజు తల లేని మొండాన్ని పాతే సమయంలో నిందితులు అతని సెల్‌ఫోన్‌ను రాయితో చితక్కొట్టి మృతదేహంతో పాటు పాతిపెట్టారు. పోలీసులు ఆ సెల్‌ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డులు, మెమరీకార్డులను పరిశీలించారు. మెమరీకార్డులో హతుడి ఫొటో ఆధారంగా గుర్తించారు. 

సీసీ పుటేజ్, ఫోన్‌ సమాచారంతో..
స్థానిక జేపీ సెంటర్‌లో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఉన్న సీసీ పుటేజ్‌ ఆధారంగా నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. దీనికితోడు ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఘటన పూర్తిగా వెలుగులోకి వచ్చింది. 

పవన్‌కుమార్‌ అంతర్‌ జిల్లా నేరస్తుడు
నిందితుల్లో ఒకడైన సుంకర పవన్‌కుమార్‌ అంతర్‌జిల్లా నేరస్తుడని డీఎస్పీ జె.వెంకటరావు తెలిపారు. అతనిపై తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయన్నారు. ఇటీవల హనుమాన్‌ జంక్షన్‌లో ఒక కేసులో బెయిల్‌పై వచ్చాడని చెప్పారు. సుంకర పవన్‌కుమార్, ముక్కు శీనుపై జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో రౌడీ షీట్‌ ఉందన్నారు. 

పోలీసులకు దొరక్కూడదని..
హత్యానంతరం మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సుంకర పవన్‌కుమార్‌ తన ఇంటికి వెళ్లి కూరగాయలు కోసే చాకు, చిన్న చేతి గునపం (టెంట్లు వేసేందుకు వాడే రాడ్డు) తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అక్కడ పవన్‌కుమార్, బాషా హతుడు టైలర్‌ రాజు గొంతును, అతని కాళ్లను కోసేశారు. ఈలోగా మిగిలిన వారు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు గొయ్యితవ్వారు. అనంతరం తల లేని మొండెం మృతదేహాన్ని, కోసిన కాళ్లను వెనక్కి విరిచి గోతిలో భూమిక సమాంతరంగా పాతిపెట్టారు. పైన చెట్ల కొమ్మలు వేశారు. తలను ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి తిరిగి ఆటోలో వస్తూ మార్గమధ్యలో ఓ ఇస్త్రీ బండి వద్ద ఉన్న చీరను తీసుకుని తలను దానితో కట్టి రాయిని జతచేసి జంగారెడ్డిగూడెం రజక చెరువలో పడేశారు.  

హతుని కుటుంబానికి సహాయం
టైలర్‌ రాజు కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి రూ.7.50 లక్షల సహాయం అందుతుందని డీఎస్పీ చెప్పారు. రాజు భార్యకు వితంతు పింఛన్‌ పొందే అవకాశం ఉందని, అతని ఇద్దరు పిల్లలకు రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువు చెప్పిస్తామని అన్నారు.  నిందితులపై హత్య కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు కూడా నమోదు చేశామని చెప్పారు. 

పోలీసులకు రివార్డులు
అతి తక్కువ సమయంలోనే టైలర్‌ రాజు హత్య కేసు చేధించిన పోలీసు అధికారులను, సిబ్బంది ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అభినందించినట్టు డీఎస్పీ వెంకటరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఎస్సై జి.శ్రీనివాస్‌యాదవ్, బుట్టాయగూడెం ఎస్సై డి.రవికుమార్‌ , ఐడీ పార్టీ సిబ్బంది ఎన్‌వీ సంపత్‌కుమార్, ఎన్‌.రాజేంద్రప్రసాద్, కె.కిరణ్, బి.రాజశేఖర్‌ను ఆయన అభినందించి వీరికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement