హేమలత(ఫైల్)
ఉపాధి కోసం వెళ్లి అనంత లోకాలకు...
Published Thu, Sep 29 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
సౌదీలో ఉరివేసుకుని మదనపల్లె మహిళ ఆత్మహత్య
– చిత్రహింసలు భరించలేకే ఉరివేసుకుందన్న కుటుంబ సభ్యులు
– రూ.1.50 లక్షలు చెల్లిస్తే శవాన్ని పంపుతామంటున్న సేట్
మదనపల్లె టౌన్: ఆమె బతుకుదెరువు పొట్ట చేతపట్టుకుని సౌదీకి వెళ్లింది. నాలుగు రాళ్లు సంపాదించి అప్పులు తీర్చుకోవాలని, పిల్లలను బాగా చదివించుకోవాలని ఆశపడింది. అక్కడ ఒక ఇంట్లో పనికి కుదిరింది. ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఆ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక, సొంత ఊరు వచ్చేందుకు వీలులేక అల్లాడింది. చావే శరణ్యమని భావించి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు... నిమ్మనపల్లె మండలం బాలినాయునిపల్లెకు చెందిన రామిశెట్టి కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు మంజునాథ 15 ఏళ్ల క్రితం మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంటిలో ఉంటూ కూలి మగ్గాలు వేసుకుంటూ భార్య హేమలత, పిల్లలు యోగీష్, దీ„ý ను పోషించుకుంటున్నాడు. సొంత మగ్గాలు వేసేందుకు రూ.2 లక్షలు అప్పు చేశాడు. పనులు సక్రమంగా జరగకపోవడం, ముడిసరుకు ధరలు పెరగడంతో అప్పులు తీర్చలేకపోయాడు.
అప్పులు తీర్చుకుందామని...
సౌదీకి వెళితే బాగా డబ్బు సంపాదించవచ్చని స్థానికంగా ఉన్న ఏజెంట్ శ్రీనివాసులు చెప్పడంతో మంజునాథ నమ్మాడు. తన భార్య హేమలత(27)ను సౌదీకి పంపించాలనుకున్నాడు. నాలుగు డబ్బులు సంపాదించుకుని అప్పులు తీర్చుకోవడంతోపాటు పిల్లలను బాగా చదివించుకోవచ్చని ఆమె కూడా సౌదీ వెళ్లేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో సౌదీ దేశం రియాద్‌లోని ఓ సేటు వద్దకు ఈ ఏడాది ఏప్రిల్ 17న హేమలత వెళ్లింది. వెళ్లిన కొద్ది రోజులకే అక్కడి సేటు ఆమెను చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెట్టాడు. వాటిని భరించలేక ఆమె తనను ఇండియాకు పంపేయాలని పలుమార్లు అతన్ని వేడుకున్నా కనికరించలేదు. తాను పడుతున్న బాధలను కుటుంబ సభ్యులకు ఫోన్‌లో వివరించి కన్నీరుమున్నీరైంది. ఎలాగైనా తనను కాపాడాలని, లేకుంటే చచ్చిపోతానని చెప్పింది. భార్య కన్నీటి బాధను ఫోన్‌లో విన్న మంజునాథ స్థానికంగా ఉన్న ఏజెంట్ శ్రీనివాసులును నిలదీశాడు. తన భార్యను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని బతిమాలాడాడు. అతను పట్టించుకోలేదు.
కడసారి చూపునకు కూడా నోచుకోలేనని...
హేమలతపై సేట్ చిత్రహింసలు మరింత ఎక్కువయ్యాయి. దీనికితోడు తన వద్ద ఉన్న ఫోన్‌ను కూడా వారు లాగేసుకోవడంతో మరింత కుంగిపోయింది. ఇండియాకు వచ్చే మార్గంలేక చావడమే మార్గంగా ఎంచుకుంది. సోమవారం రాత్రి తాను ఉంటున్న ఇంటిలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయిన మూడు రోజుల తర్వాత సేటు హేమలత భర్త మంజునాథకు ఫోన్ చేశాడు. నీ భార్య ఉరివేసుకుని చనిపోయిందని, శవాన్ని పంపించాలంటే రూ.1.50 లక్షలు చెల్లించాలని పేర్కొన్నాడు. దీంతో ఏమి చేయాలో తెలియక మంజునాథ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు బాధితుడు గురువారం టూటౌన్ పోలీసులను కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ గంగిరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement