మహిళకు నెట్టిల్లు మేలు ‘ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే ఏమవుతుంది?’ అనే ప్రశ్న ఒకప్పుడైతే అంత తీవ్రంగా ఆలోచించాల్సినంత ప్రశ్న కాకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకు అధ్యయనకర్తలు అనేక కోణాలలో జవాబులు అన్వేషిస్తున్నారు...
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కీలక దశలో ఉంది. మధ్యతరగతి అభివృద్ధిపథంలో ఉంది. అయితే ఈ పురోగతికి ఒక ఆటంకం ఉంది. అదే... డిజిటల్ జెండర్ డివైడ్. ఇంటర్‌నెట్‌ను ఉపయోగించడంలో స్త్రీ, పురుషుల మధ్య భారీ అంతరం ఉండడమే డిజిటల్ జెండర్ డివైడ్.
ఇంటర్‌నెట్ అందుబాటులో లేని 260 కోట్ల మందిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. దీనివల్ల మహిళలు ఉద్యోగ శిక్షణకు దూరం అవుతున్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ఆరోగ్య, ఆర్థిక సేవలకు దూరం అవుతున్నారు.
గత 25 ఏళ్లలో దక్షిణాసియా అంతటా డిజిటల్ యాక్సెస్ విపరీతంగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే గత దశాబ్దకాలంలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది. అయితే స్త్రీ, పురుషుల విషయంలో ఈ పురోగతి ఒకేరకంగా లేదు. కట్టుబాట్లు మొదలుకొని వ్యవస్థాగత కారణాలు, పేదరికం వరకు రకరకాల కారణాల వల్ల మహిళలు, బాలికలు ఇంటర్నెట్‌కు దూరం అవుతున్నారు.
ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలలో మహిళలు విద్య, ఉద్యోగాలలో వెనకబడిపోతున్నారు. ఇంటర్నెట్‌కు దూరం కావడం అనేది మహిళల కెరీర్ అవకాశాలను పరిమితం చేస్తుంది. మన దేశంలో 20–25 శాతం వ్యాపారాలు మహిళలు నిర్వహిస్తున్నప్పటికీ 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మూలధనాన్ని సమీకరించుకోగలుగుతున్నారు.
ఇక ‘స్టెమ్’ విషయానికి వస్తే దక్షిణాసియా అంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మహిళలు 25 శాతం మాత్రమే ఉన్నారు. ‘స్టెమ్’ ఫీల్డ్‌కు సంబంధించిన ఉద్యోగాలలో కూడా మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ‘డిజిటల్ జెండర్ డివైడ్ అనేది కేవలం సామాజిక సమస్య కాదు ఆర్థిక సమస్య కూడా’ అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్‌ల మంది బాలికలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కేవలం మూడేళ్లలో ఆయా దేశాల జీడిపీలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
‘మహిళలు ఇంటర్‌నెట్‌కు దగ్గరైతే ఉద్యోగ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది మహిళలకు వారి కుటుంబాల మెరుగైన జీవన నాణ్యత(క్వాలిటీ ఆఫ్ లైఫ్)కు దారి తీస్తుంది. మహిళలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. తరతరాలకు ఉపయోగపడే ఫలాలు ఇస్తుంది’ అంటున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డిజిటల్ ఇన్‌క్లూజన్ హెడ్ కెల్లీ ఓముడ్సెన్.
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యోగాల సంఖ్య 9.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే వారు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది అనివార్యం.
Comments
Please login to add a commentAdd a comment