ఈ పథకాల్లో పెట్టుబడి సురక్షితం
ఈ పథకాల్లో పెట్టుబడి సురక్షితం
Published Mon, Aug 22 2016 8:49 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
చింతలపూడి : ప్రస్తుతం బ్యాంక్ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే చిరుజీవులకు కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా చిన్న మొత్తాల సంస్థ పథకాలు ఉపయుక్తంగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు భద్రత తక్కువ. చిన్నమొత్తాల పొదుపు ప«థకాల్లో పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయి. పైగా ప్రభుత్వ హామీని కలిగి ఉంటాయి. దీంతో అవే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ పథకాల గురించి ఓ సారి స్థూలంగా..
పీపీఎఫ్ పథకం
వడ్డీ రేట్ల విషయంలో బ్యాంక్ డిపాజిట్లతో పోలిస్తే పీపీఎఫ్ ఉత్తమమైన పథకం. బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పరిమితి దాటితే పన్ను కట్టాల్సి వస్తుంది. పీపీఎఫ్‌కైతే పన్ను మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు కేవలం 7.5 శాతం వడ్డీ ఇస్తుండగా, పీపీఎఫ్‌లో మాత్రం 8.1 శాతం వడ్డీ వస్తోంది. ఆదాయపు పన్నుచట్టం 80సీ పన్ను మినహాయింపు ఉంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 ఏళ్లు.
సుకన్య సమృద్ధి
కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల పథకాలను పక్కన పెడితే ఏ ఇతర పెట్టుబడి పథకంలో కూడ 8.6 శాతం వడ్డీ రావడం లేదు. కాబట్టి మీకు అమ్మాయి ఉంటే ఈ పథకం గురించి ఆలోచించడం మంచిది. వచ్చే రాబడికి పన్ను ఉండదు. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. మీకు అమ్మాయి ఉంటే వెంటనే ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు
ఇతర పోస్టాఫీసు పథకాల్లాగే జాతీయ పొదుపు పత్రాలు బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ రేటు అంటే బ్యాంకుల కంటే 0.5 శాతం అదనంగా వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో భాగంగా 8.6 శాతం వడ్డీ వస్తోంది. ఇది మారుతూ ఉంటుంది. ఈ పథకంలోనూ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఇందులో పెట్టుబడి కాల పరిమితి ఐదేళ్లు. ఈ ఖాతాలను ఒక పోస్టాఫీసు నుంచి మరో చోటకు, ఓ బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకునే సదుపాయం ఉంది. వడ్డీ సంవత్సరానికి 10 వేలు మించితే టీడీఎస్ కట్ చేస్తారు.
నెలవారీ ఆదాయ పథకాలు
నెలవారీ ఆదాయ పథకాలు కూడా బ్యాంక్ డిపాజిట్లకంటే మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. నెలవారీ బ్యాంక్ డిపాజిట్లపై మీకు వచ్చే వడ్డీ 7–7.3 శాతం మధ్య ఉంటే , నెలవారీ ఆదాయ పథకాల్లో వచ్చే వడ్డీ 7.8 శాతం ఉంది.
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకంలో డిపాజిట్లపై ఏప్రిల్ 1, 2016 నుంచి 7.4 శాతం వడ్డీ వస్తోంది. ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి కాంపౌండ్ అవుతుంది. డిపాజిట్ చేసిన ఏడాది తరువాత విత్‌డ్రాయల్స్‌కు అనుమతి ఇస్తారు. కనీసం రూ.10 నిల్వతో పోస్టాఫీస్ ఆర్‌డీని ప్రారంభిచవచ్చు. ఖాతాను చెక్కు, నగదు రూపంలో తెరిచేందుకు వీలుంది. ఖాతాను మైనర్ పేరిట కూడా తెరవచ్చు. నామినేషన్ ఎంచుకునే సౌకర్యం కూడా ఉంది.
Advertisement
Advertisement