అల్పాహారం ప్రారంభించే న్యూ గర్మిళ్ల పాఠశాల
మంచిర్యాల: సర్కారు బడిలో విద్యార్థులకు అల్పాహారం పథకం శుక్రవారం లాంఛనంగా ప్రారంభం కానుంది. జిల్లాలో నియోజకవర్గానికో పాఠశాలలో పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.
మంచిర్యాల నియోజకవర్గంలో న్యూగర్మిళ్ల పాఠశాల, చెన్నూర్ నియోజకవర్గంలో మందమర్రి ఫిల్డర్‌బెడ్ ఎంపీపీఎస్, బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి 2ఇంక్‌లైన్ ఎంపీపీఎస్‌ల్లో పథకాన్ని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, ప్రభుత్వ విప్ సుమన్, దుర్గం చిన్నయ్య ప్రారంభిస్తారు.
పాఠశాల సమయానికి కంటే 45 నిమిషాల ముందు అల్పాహారం అందిస్తారు. పిల్లలో పోషకాహార లోపం నివారించడం, తరగతి గదిలో హాజరు నమోదు పెంచడానికి ప్రభుత్వం అల్పాహార పథకాన్ని అమలు చేస్తోంది.
కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ఎప్పుడో..?
డ్రాపౌట్స్ నివారణతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు నిర్ణయించనట్లు 2020 జూలై 18న కేసీఆర్ ప్రకటించారు. మూడేళ్లయినా పథకం అమలుకు నోచుకోక విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 10 ప్రభుత్వ కళాశాలల్లో 3,600 మంది విద్యార్థులు ఉన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు కళాశాలకు ఉదయం 8గంటలకు బయలుదేరితే ఇంటికి వెళ్లేసరికి రాత్రి 8గంటలు దాటుతుందని తెలుస్తోంది. కళాశాలలో చదివే విద్యార్థులందరూ పేదలు కావడంతో ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండానే కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.
దీంతో అర్ధాకలితో పాఠాలు అర్థంకాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్న ప్రభుత్వం కనీసం కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు.
మెనూ ఇలా..
సోమవారం : ఇడ్లీ, సాంబారు లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం : పూరి, ఆలుకూర్మా లేదా టోమాటో బాత్, సాంబార్
బుధవారం : ఉప్మా, సాంబారు లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ
గురువారం : చిరుధాన్యాల ఇడ్లీ, సాంబారు లేదా పొంగల్, సాంబారు
శుక్రవారం : ఉగ్గని, అటుకలు, చిరుధాన్యాల ఇడ్లి, చట్నీ, లేదా బియ్యం రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం : పొంగల్, సాంబారు లేదా కూరగాయల పులావ్, పెరుగు చట్నీ, ఆలుకుర్మా
Comments
Please login to add a commentAdd a comment