పైకొచ్చిన పాతాళ గంగమ్మ
పైకొచ్చిన పాతాళ గంగమ్మ
Published Mon, Oct 3 2016 10:51 PM | Last Updated on Thu, Mar 28 2019 6:13 PM
మోర్తాడ్ : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భ జల మట్టం గణనీయంగా అభివృద్ధి చెందింది. భూగర్భ జలాలు పైకి రావడంతో.. ఎత్తిపోయిన బోరుబావుల్లోకీ నీరువచ్చింది. కొన్ని బోరుబావుల్లోంచి నీరు దానికదే పైకి వస్తుండడంతో విద్యుత్ అవసరం కూడా తప్పింది.
భూగర్భ జలవనరుల శాఖ శాస్త్రవేత్తలు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఫీజో మీటర్ల నుంచి సేకరించిన నీటి మట్టం వివరాలను పరిశీలిస్తే గతంలో కంటే తక్కువ లోతుకు నీటి మట్టం చేరిందని స్పష్టం అవుతోంది. మూడేళ్ల తర్వాత జిల్లాలో నీటి మట్టం సాధారణ స్థితికి వచ్చిందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
మేలో జిల్లా సగటు నీటి మట్టం 21.06 మీటర్లు ఉండగా ఇప్పుడు 13.01 మీటర్లకు చేరింది. గతేడాది తక్కువ వర్షపాతం నమోదు కావడంతో సెప్టెంబర్ 2015లో నీటి మట్టం 16.12 మీటర్ల లోతులో ఉంది. భూగర్భ జలవనరుల శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం 15 మీటర్లకంటే ఎక్కువ లోతులో నీరు ఉంటే ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నట్లు.. రెండేళ్ల పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జల మట్టం జిల్లాలో 15 మీటర్ల నుంచి 40 మీటర్ల లోతుకు వెళ్లింది. దీంతో చాలా బోరుబావులు ఎత్తిపోయాయి. చాలాచోట్ల వెయ్యి ఫీట్లకుపైగా లోతుకు బోరు తవ్వించినా ఫలితం లేకపోయింది.
సెప్టెంబర్‌లో భారీ నుంచి అతి భారీ వర్షం కురియడంతో పరిస్థితి మారింది. ఈ సీజన్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 826 మిల్లీమీటర్లు కాగా.. 1,059 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అంటే 233 మిల్లీ మీటర్ల వర్షపాతం ఎక్కువ నమోదు అయ్యింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలలో భూగర్భ జల మట్టం సాధారణ స్థితికి చేరుకోలేదు. ఆ ప్రాంతాలలో నీటి పొరల మధ్య దూరం ఎక్కువ ఉండడం వల్ల నీటి మట్టం సాధారణ స్థితికి చేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని భూగర్భ జల శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లో మేలో నీటి మట్టం 21.32 మీటర్ల లోతులో నమోదు అయ్యింది. ఇప్పుడు 10.23 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలున్నాయి.
బోధన్ డివిజన్‌లో మేలో 16.56 మీటర్ల లోతులో నీరుండగా ఇప్పుడు 11.12 మీటర్ల లోతులో ఉంది.
కామారెడ్డి డివిజన్‌లో మేలో 24.34 మీటర్ల లోతులో నీరుండగా ఇప్పుడు 17.85 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వచ్చాయి.
జిల్లాలోని నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలో నీటి మట్టం సాధారణ స్థితికి చేరుకున్నా కామారెడ్డి ప్రాంతంలో మాత్రం ఇంకా పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. భూగర్భ జలవనరులు వృద్ధి చెందడానికి తగిన ఏర్పాట్లు లేక పోవడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయినా కామారెడ్డి ప్రాంతంలో మాత్రం భూగర్భ జలాలు ఇంకా లోతులోనే ఉండిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై లోతుగా అధ్యయనం చేసి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
జిల్లాలోని ఫీజో మీటర్ల వారీగా నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
ఫీజో మీటరు కేంద్రం నీటి మట్టం లోతు(మీటర్లలో)
పుల్కల్ 1.06
నస్రూల్లాబాద్ 1.09
అర్సపల్లి 1.24
నూత్‌పల్లి 1.63
ఎర్రాపహాడ్ 2.07
గన్నారం 4.36
బోధన్ 4.4
బాన్సువాడ 5.18
మంచిప్ప 5.41
జుక్కల్ 6.41
పెద్దవాల్గోట్ 6.62
పెర్కిట్ 7.09
అంక్సాపూర్ 7.35
అయిలాపూర్ 8.12
చౌట్‌పల్లి 9.0
వెల్మల్ 9.45
భవానీపేట్ 10.04
అర్గొండ 10.1
వర్ని 10.17
జక్రాన్‌పల్లి 10.45
మహమ్మద్‌నగర్ 11.65
సదాశివనగర్ 12.2
యానంపల్లి 12.86
ముప్కాల్ 12.91
రెడ్డిపేట్ 13.21
మీనూర్ 13.5
రామడుగు 13.75
మదన్‌పల్లి 13.92
నర్సన్నపల్లి 15.1
మాచారెడ్డి 16.24
మాల్తుమ్మెద 17.18
రాయ్‌కూర్ 17.45
భీమ్‌గల్ 18.5
ఎడపల్లి 19.11
మోర్తాడ్ 20.51
దూపల్లి 21.4
గాంధారి 22.0
భిక్కనూరు 22.23
కోటగిరి 22.32
అడ్లూర్ 22.35
సర్వాపూర్ 22.73
వేల్పూర్ 22.86
పెద్దమల్లారెడ్డి 23.21
బీబీపేట్ 26.95
దోమకొండ 29.19
Advertisement
Advertisement