♦ చెల్లింపు కేటగిరీ క్రమబద్ధీకరణలో
♦ మొదలు కాని రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు మే 31 దాకా ప్రభుత్వం గడువు పెంచినా పెద్దగా స్పందన కని పించడంలేదు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులుగా ఎంపికైనవారికి నిర్దేశిత సొమ్ము చెల్లించాల్సిందిగా రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చినా లబ్ధిదారులెవరూ ముందుకు రాని పరిస్థితి. పూర్తిస్థాయిలో సొమ్ము చెల్లించిన వారికి కూడా ఆయా స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో వాయిదాల పద్ధతిలో సొమ్ము చెల్లించే వారూ వెనుకంజ వేస్తున్నారు. క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో అధిక భాగం వివిధ కారణాలు చూపుతూ అధికారులు పక్కన బెట్టడం కూడా మరో కారణం.
వాస్తవానికి చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,915 దరఖాస్తులు అందగా, అం దులో 17,891 దరఖాస్తులనే అధికారులు క్లియర్ చేశారు. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ చేసే విషయమై ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినప్పటికీ క్షేత్రస్థాయి లో తహసీల్దార్లు, ఆర్డీవోలు రకరకాల సాకులు చూపుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వడం లేదన్న ఆరోపణలున్నాయి.
బేసిక్ వాల్యూ తగ్గించాలని డిమాండ్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధర కన్నా సబ్‌రిజిస్ట్రార్లు చెబుతున్న బేసిక్‌వాల్యూ ఎక్కువగా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో బతుకుదెరువు కోసం టీ స్టాల్, చిన్న దుకాణం పెట్టుకున్నా కమర్షియల్ కేటగిరీగా పరిగణిస్తున్నారంటున్నారు. దీనిపై లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సీసీఎల్‌ఏ కార్యాలయాల్లో అప్పీల్ చేసుకుంటున్నారు.