
జాతి పండుగ.. సమైక్యత నిండుగ
► ‘అనంత’లో ఘనంగా 70వ స్వాతంత్య్ర వేడుకలు
► జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన సీఎం చంద్రబాబు
► జిల్లా అభివృద్ధికి రూ.6,554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ
► టవర్‌క్లాక్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి నివాళి
► ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటాలు..సాంస్కృతిక ప్రదర్శనలు
► స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
సాక్షిప్రతినిధి, అనంతపురం : భరత జాతి పండుగ సమైక్యతా స్ఫూర్తిని ఘనంగా చాటింది. కుల,మత,వర్గ, లింగ బేధాలకు అతీతంగా ప్రజలందరూ భరతమాతకు జేజేలు అర్పించారు. మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో 70వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత డీజీపీ సాంబశివరావు ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రికి స్టేడియంలోని ఆర్మ్‌డ్, నాన్ ఆర్మ్‌డ్ కవాతు బృందాలను చూపించారు. తర్వాత కవాతు ప్రదర్శనను సీఎం తిలకించారు.
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్‌ను అందజేశారు. ప్రభుత్వ పథకాలపై రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. పౌరసరఫరాల శాఖ శకటానికి Sమొదటి, ఉద్యాన శాఖ శకటానికి ద్వితీయ, విద్యుత్, పరిశ్రమలశాఖ శకటాలకు తృతీయ బహుమతులను అందజేశారు. ఆపై రాష్ట్రప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రసంగం తర్వాత అవార్డులు పొందిన వారితో గ్రూపు ఫొటో దిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ప్రత్యేకంగా సత్కరించారు. తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. పీటీసీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి∙తిరుగు పయనమయ్యారు. అంతకుముందు నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు.
జిల్లా అభివృద్ధికి రూ.6,554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ
ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో జిల్లా అభివృద్ధి కోసం ‘ఎన్టీఆర్ ఆశయం’ పేరుతో రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో కరువు నివారణకు రూ. 1,767కోట్లు, వ్యవసాయాభివృద్ధికి రూ.2,654 కోట్లు, తాగునీటికి రూ.500 కోట్లు, పరిశ్రమల అభివృద్ధికి రూ.100 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు, స్వచ్చ అనంతపురానికి రూ.94 కోట్లు,పేరూరు ప్రాజెక్టు ఫేజ్–1కు రూ.850 కోట్లు, భైరవానితిప్ప ప్రాజెక్టు ఫేజ్–1కు రూ.450 కోట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా మారుస్తానని సీఎం పునరుద్ఘాటించారు.
‘అనంత’కు సెంట్రల్, ఎనర్జీ యూనివర్సిటీలు
అనంతపురంలో సెంట్రల్æ, ఎనర్జీ యూనివర్సిటీలు స్థాపిస్తామన్నారు. పారిశ్రామికSకారిడార్‌గా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో పండ్లతోటల పెంపకంపై ప్రత్యేకSదృష్టి సారించి హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. వేరుశనగ పరిశోధన కోసం ప్రత్యేకంగా ఇక్కడ∙డైరెక్టరేట్ స్థాపించి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయస్థాయిలో మార్కెటింగ్ చేస్తామన్నారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాలో సాగునీటి కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
రాళ్లసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి రాక మునుపు డీజీపీ సాంబశివరావుకు పోలీసులు గౌరవవందనం చేశారు. శకటాల ప్రదర్శన అనంతరం వాటిని నగరంలో ప్రజలు తిలకించేలా ప్రధాన రోడ్లపై తిప్పారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, పీతలసుజాత, పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, హనుమంతరాయ చౌదరి, చాంద్‌బాషా, ఎమ్మెల్సీలు మెట్టుగోవిందరెడ్డి, పయ్యావుల కేశవ్, గేయానంద్, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్డీవో మలోల తదితరులు పాల్గొన్నారు.