ఇక స్వదేశీ నావిగేషన్ సిస్టం | India's very own GPS is ready with PSLV c33 satellite launch | Sakshi
Sakshi News home page

ఇక స్వదేశీ నావిగేషన్ సిస్టం

Published Thu, Apr 28 2016 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థ మరో రెండు నెలల్లోనే అందుబాటులోకి రానుంది.

భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థ మరో రెండు నెలల్లోనే అందుబాటులోకి రానుంది. గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు షార్ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ33(PSLV C-33) రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్(IRNSS) ఉపగ్రహాల శ్రేణిలో ఏడో ఉపగ్రహమైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ(IRNSS - 1G) విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి పంపించారు.

 

భారతదేశానికి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నావిగేషన్ సిస్టంను తయారు చేసుకోవడానికి ఏడు ఉపగ్రహాల అవసరాన్ని 2006 లోనే ఇస్రో గుర్తించి దీనికి రూ.3,425 కోట్లు వ్యయం అవుతుందని ప్రతిపాదించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.



 భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలకు రూ1,000 కోట్లు, రాకెట్లుకు రూ.1,125 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌కు చేపట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థకు ప్రత్యేకంగా బెంగళూరు సమీపంలో బైలాలు అనే ప్రాంతంలో రూ.1,300 కోట్లతో గ్రౌండ్ స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి 2006 లోనే ప్రణాళికలు సిద్ధం చేసుకుని 2014 నాటికి రూపాంతరం చెంది అదే సంవత్సరం జూలై 1న ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (IRNSS-1A) ఉపగ్రహం ప్రయోగంతో శ్రీకారం చుట్టారు.

ఏప్రిల్ 4న IRNSS-1B ఉపగ్రహ ప్రయోగాన్ని, అక్టోబర్ 16న IRNSS-1C ఉపగ్రహ ప్రయోగం, 2015 మార్చి 28న IRNSS-1D ఉపగ్రహాన్ని, ఈ ఏడాది జనవరి 17న IRNSS-1E ఉపగ్రహాన్ని, మార్చి 10న IRNSS-1F ఉపగ్రహాన్ని, గురువారం IRNSS-1G ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహ వ్యవస్థలోని ఏడు ఉపగ్రహాల్లో మూడు ఉపగ్రహాలు భూమికి 36 వేలు కిలో మీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో 34 డిగ్రీలు, 83 డిగ్రీలు, 130.5 డిగ్రీ తూర్పు రేఖాంశాల వద్ద కక్ష్యలో ఉండి పనిచేస్తాయి. మిగతా నాలుగు ఉపగ్రహాలు భూమధ్య రేఖలను ఖండించే భూస్థిర కక్ష్యలోనే 55 డిగ్రీలు, 115 డిగ్రీల తూర్పు భూమధ్య రేఖాతలానికి 31 డిగ్రీల వాలుతో ఉండే కక్ష్యలో 12 ఏళ్లు పాటు సేవలందిస్తాయి.

భూస్థిర కక్ష్యలో వివిధ స్థానాల్లో ఉండి పని చేయడం ప్రారంభించి స్వదేశీ దిక్సూచి వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. భారతదేశం అంచునుంచి సుమారు 1,500 కిలో మీటర్లు పరిధి వరకు ఈ సేవలు విస్తరించి పని చేస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు పదేళ్లుగా చేసిన కషి ఫలించి సొంత నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement