వలస వెళ్లినవారికి సమాచారం అందించాలి
మెదక్‌రూరల్: రైతుల సంక్షేమం కోసం చేస్తున్న సమగ్ర సర్వేకు రైతులతో ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు సహకరించాలని మండల వ్యవసాయ అధికారి రెబెల్‌సన్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండలం రాజ్‌పల్లి, బోల్లారం, మగ్దూంపూర్‌లో రైతు సమగ్రసర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర సర్వేకు గడువు ముగుస్తోందని, సమచారం తెలియని రైతులకు సర్వే సమాచారం తెలియజేయాలని సూచించారు. అలాగే ఖరీఫ్‌లో వరితోపాటు పప్పుదినుసులు, కూరగాయల పంటలను రైతులు సాగుచేయాలన్నారు. పంట మార్పిడి ప్రయోజనాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శేఖర్, సందీప్, కీర్తన, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పలువురు రైతులు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలో రైతు సమగ్ర సర్వే కొనసాగుతోంది. మంగళవారం మండల పరి«ధిలోని బద్దారంలో అధికారులు రైతుల వివరాలు సేకరించారు. మండల రైతుల ఆధార్, పాస్‌బుక్, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నామని ఏఓ రత్న తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓలు సావిత్రి, స్వాతి, వీఆర్వోలు, వీసీఓలు తదితరులున్నారు.
టేక్మాల్(మెదక్): రైతు సమగ్ర సర్వేకు గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని జిల్లా వ్యవసాయాధికారి నాగమణి విజ్ఞప్తిచేశారు.మంగళవారం మండలంలోని దాదాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను పర్యవేక్షించారు. సర్వేలో సర్పంచ్ లక్ష్మీ, ఏఈఓ సునీల్, వీఆర్‌ఏ శంకర్, నాయకులు విక్రం తదితరులు పాల్గొన్నారు.
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఏఈఓ శోభరాణి ఆధ్వర్యంలో రైతు సమగ్ర సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 10వ తేదీ వరకు సర్వే జరుగుతుందని తెలిపారు. కాగా వలస వెళ్లిన రైతులు తమ కుటుంబంలో ఒకరు స్వగ్రామానికి వచ్చి తమ వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.