- క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చిన ఎమ్మెల్యే రాజా
- జీజీహెచ్‌లో కోలుకుంటున్న బాధితులు
ఆ చొరవే ఊపిరి పోసింది
Published Sat, May 13 2017 12:13 AM | Last Updated on Mon, Oct 29 2018 8:21 PM
తుని రూరల్ :
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రాణాలను నిలబెట్టారు. ఫో¯ŒS చేశాం అంబులెన్సు వస్తుందని కొంతమంది, ప్రత్యామ్నాయ వాహనంలో తరలిస్తే తమకు ఏ కేసులు చుట్టుకుంటాయోనని మరికొందరు ఎదురు చూస్తుండగా అటుగా వచ్చిన ఎమ్మెల్యే చొరవ తీసుకోవడం ఎంతో మందిని కదిలించింది. గురువారం సాయంత్రం తుని మండలం మరువాడవద్ద జరిగిన ఆటో, మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో ఇదే మండలం బుచ్చి సీతయ్యపేటకు చెందిన దంపతులు కె.సింహాచలం (పెదబాబులు), సీతారత్నం తీవ్రంగా గాయపడ్డారు. ఒక దశలో సింహాచలం మృతి చెందాడని భావించిన స్థానికులు అతన్ని పట్టించుకోలేదు. సీతారత్నాన్ని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్సు కోసం ఎదురు చూస్తుండిపోయారు. కేఓ మల్లవరంలో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న ఎమ్మెల్యే రోడ్డుపై పడిఉన్న దంపతులను చూసి వారిని ఎవరూ పట్టించుకోకపోవడంతో చలించిపోయారు. వెంటనే తన వాహనాన్ని పక్కన నిలిపి ఆటోగా పోతున్న ఆటోలో క్షతగాత్రులను ఎక్కించి తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక తన వాహనంలో ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో చర్చించి సత్వర వైద్యం అందించారు. సింహాచలానికి కాలు, సీతారత్నానికి వెన్నుముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో సింహాచలం, సీతారత్నం వైద్యసేవలు పొందుతూ కోలుకుంటున్నారు. సకాలంలో ఎమ్మెల్యే రాజా స్పందించి ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డామని క్షతగాత్రులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే సేవాహృదయంతో తమ పిల్లలను పోషించుకునేందుకు జీవించే అవకాశం లభించిందన్నారు. నేటి రాజకీయ నాయకుల్లో సేవాతత్పరత కానరావడంలేదని, అందుకు భిన్నంగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడంతోపాటు ఇటువంటి సంఘటనల్లో తన ఔదార్యం చాటుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు.
Advertisement