– విధుల్లో చేరేందుకు మునిసిపల్ టీచర్లు ససేమిరా
– కలెక్టర్, ఆర్జేడీ కన్నెర్ర...చేరని వారిపై యాక్ట్–25 కింద కేసు
– నేటి ఉదయం వరకు గడువు
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో కొందరు టీచర్లు తిరకాసు పెట్టారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని వివిధ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు విధులకు డుమ్మా కొట్టేందుకు ఎత్తుగడ వేశారు. చివరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్జేడీ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. విధుల్లో చేరని వారిపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే యాక్ట్ 25 కింద కేసులు నమోదు చేయాలని వారు ఆదేశించారు. అనంతపురం నగర పరిధిలోని మునిసిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో పని చేçస్తున్న వారిలో సుమారు 120 మంది టీచర్లను ఇన్విజిలేషన్ విధులకు నియమించారు.
వీరంతా గురువారం ఉదయం 10 గంటలకు ఆయా సెంటర్లలో రిపోర్టు చేసుకోవాల్సి ఉంది. అయితే 80 శాతం మంది సాయంత్రం వరకు రిపోర్టు చేసుకోలేదు. ఆర్డర్లు రద్దు చేసుకునేందుకు పైరవీలు చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, రాజకీయ నేతలతో ఒత్తిళ్లు చేయించే పనిలో పడ్డారు. దీంతో ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తీవ్రంగా పరిగణించారు. ఏ ఒక్కరి ఆర్డరు రద్దు చేయొద్దని, అందరూ విధిగా చేరాల్సిందేనంటూ స్పష్టం చేశారు.
నేటి ఉదయం వరకు గడువు
విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ప్రతాప్‌రెడ్డి సాయంత్రం సమీక్షించారు. విధుల్లో చేరకపోతే యాక్ట్ 25 కింద కేసులు నమోదు చేస్తామంటూ అందరికీ వాట్సాప్ మేసేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు పంపాలని ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు మెసేజ్‌లు పంపగా ఆగమేఘాల మీద 90 శాతం మంది విధుల్లో చేరారు. తక్కిన వారు కూడా శుక్రవారం ఉదయంలోగా చేరాలని ఆదేశించారు. అనారోగ్యం ఉంటే వైద్యధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్, డిప్యూటీ డీఈఓలు చాంద్‌బాషా, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించలేదు – ఫ్యాప్టో
సీఓలు, డీఓలు, ఇన్విజిలేటర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు ఆరోపించారు. ఈ మేరకు ఆర్జేడీకి వినతిపత్రం అందజేశారు. 8 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలల నుంచి 50 శాతం టీచర్లను అందులోనూ ఇంటర్ ఇన్విజిలేషన్ విధులకు వెళ్లనివారిని పదో తరగతి ఇన్విజిలేషన్‌కు నియమించాలని పేర్కొన్నారు. ఇంకా అవసరమైతే అదే మండలం, మరీ అవసరమైతే సమీప మండలాల నుంచి నియమించాలని తెలిపారు. ఈ నిబంధనలు పాటించలేదని పేర్కొన్నారు. 8 మంది టీచర్లుంటే ఆరుగురిని డ్యూటీకి వేశారని, 25 మంది టీచర్లున్న పాఠశాలల నుంచి ఒక్కరినీ నియమించలేదని వివరించారు. 8 కిలోమీటర్లు దాటిì నియమించిన టీచర్లకు టీఏ,డీఏ ఇవ్వాలని నిబంధన ఉన్నా...అధికారులు మాత్రం ‘నో టీఏ, డీఏ’ అంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని గుర్తు చేశారు.
‘ఇన్విజిలేషన్’ తిరకాసు!
Published Thu, Mar 16 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
Advertisement
Advertisement