విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచ్లు?
విశాఖపట్నం: విశాఖపట్నంలో కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించే అవకాశముంది. శుక్రవారం బీసీసీఐ అధికారులు విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని పరిశీలించారు. ఈ వేదికలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ విషయాన్ని చర్చించినట్టు సమాచారం. మహారాష్ట్ర నుంచి తరలించే ఐపీఎల్ మ్యాచ్లలో కొన్నింటిని విశాఖలో నిర్వహించవచ్చు.
కరువు, నీటికొరత కారణంగా మహారాష్ట్ర నుంచి ఐపీఎల్ మ్యాచ్లను తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్లను ఇతర ప్రాంతాలకు తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మహారాష్ట్రలో ముంబైతో పాటు పుణె, నాగ్పూర్ వేదికల్లో జరగాల్సిన 13 మ్యాచ్లను ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.