పీఎల్‌ఎఫ్ హామీ.. జెన్‌కో కహానీ... | irregularities in Solar Contract Tenders | Sakshi
Sakshi News home page

పీఎల్‌ఎఫ్ హామీ.. జెన్‌కో కహానీ...

Published Tue, Jan 26 2016 5:04 PM | Last Updated on Mon, Oct 22 2018 8:40 PM

irregularities in Solar Contract Tenders

21శాతం పీఎల్‌ఎఫ్ దేశంలో ఎక్కడా లేదు..
అధిక బిడ్డింగ్‌ను సమర్థించుకోవడం కోసమే కథలు
ప్రయివేటు కంపెనీలకు దోచిపెట్టే ఎత్తుగడలు
నాణ్యమైన దేశీయ సోలార్ ప్యానల్స్ వాడాలన్న నిబంధన లేదు
చౌకైన విదేశీ ప్యానెల్స్ వాడేందుకు వెసులుబాటు
ఎక్కువ ప్యానల్స్‌తో అధిక ఉత్పత్తీ బూటకమేనంటున్న నిపుణులు
ఏపీ జెన్‌కో ‘సోలార్’ టెండర్లలో తవ్వినకొద్దీ అవినీతి

షోరూంలో ఒక ద్విచక్రవాహనం కొంటాం. లీటర్ పెట్రోలు 100 కిలోమీటర్లు ఇస్తుందని చెబుతారు. రోడ్డు మీదకొచ్చాక 60 కిలోమీటర్లు మించి ఇవ్వదు. అడిగితే... ల్యాబ్ కండిషన్స్ ప్రకారమే ఆ మైలేజీ అంటారు. రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే అంత మైలేజీ వస్తుందని మేం హామీ ఇచ్చామా అని ప్రశ్నిస్తారు.... ఏపీ జెన్‌కో సోలార్ కాంట్రాక్టుల విషయంలో నూటికి నూరుపాళ్ళు ఈ సూత్రాన్నే రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తోంది. 21 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) ఉండటం వల్లే సోలార్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందని జెన్‌కో చెబుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గానీ, ఎన్టీపీసీ చేపట్టిన ఇతర ప్రాజెక్టులలో గానీ పీఎల్‌ఎఫ్ 18.2 శాతం మాత్రమే. దేశంలో ఎక్కడా 21శాతం పీఎల్‌ఎఫ్ సాధ్యం కాలేదు. మరి మన రాష్ర్టంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? దానికి జెన్‌కో వద్ద సరైన సమాధానం లేదు.
 
సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారిచెరువు వద్ద ఏపీ జెన్‌కో చేపట్టే 500 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం టెండర్ల వ్యవహారంలో తవ్వినకొద్దీ అవినీతి వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రిక సోమవారం ప్రచురించిన ‘ఏపీ సోలార్... రూ.755 కోట్లు గోల్‌మాల్’ కథనం ఏపీ జెన్‌కో వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టుల్లో చోటుచేసుకున్న ఇతర కోణాలపై  సోలార్ విద్యుత్ రంగ నిపుణులు విలువైన సమాచారం అందించారు. ఇందులో ప్రధానంగా సోలార్ ప్యానళ్ళపై లోతైన విశ్లేషణలు చేశారు.

పీఎల్‌ఎఫ్ అంటే...
ఒక మెగావాట్ సామర్థ్యమున్న ప్లాంట్ 365 రోజులూ పనిచేస్తే వచ్చే ఉత్పత్తిని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) అంటారు. పీఎల్‌ఎఫ్ అనేది ప్లాంట్‌లో ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్ నాణ్యత, సంఖ్య, వాతావరణ స్థితిగతులు వంటి ఎన్నిటిపైనో ఆధారపడి ఉంటుంది. ఏపీజెన్‌కో తలపెట్టిన తలారిచెరువు సోలార్ పవర్‌ప్లాంట్లలో పీఎల్‌ఎఫ్ సాధ్యాసాధ్యాలపై సోలార్ విద్యుత్ రంగ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు.
 
21శాతం పీఎల్‌ఎఫ్ సాధ్యమేనా?
భారత్‌లో తయారయ్యే సోలార్ ప్యానెల్స్‌కి, ఇతర దేశాల్లో తయారయ్యే ప్యానెల్స్‌కి చాలా తేడా ఉంది. విదేశాల్లో సాధారణంగా సగటు పరిసరాల ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు మించదు.  భారత్‌లో సగటు పరిసరాల ఉష్ణోగ్రత 24 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉంటుంది. అంటే స్వదేశీ ప్యానల్స్ కన్నా, విదేశీ ప్యానల్స్ నుంచి తక్కువ సౌరవిద్యుత్ వస్తుందని అర్ధమౌతుంది.

ఒక మెగావాట్‌కు విదేశీ ప్యానళ్ళు వాడితే భారత వాతావరణ స్థితి గతుల ఆధారంగా 17 నుంచి 18 శాతం పీఎల్‌ఎఫ్ మాత్రమే ఇస్తాయి. ప్యానల్స్ సంఖ్య పెంచినా ఇందులో మార్పు ఉండదనేది నిపుణుల అంచనా. ఎందుకంటే, 500 మెగావాట్లకు 17.5 లక్షల ప్యానళ్ళు వాడితే, సౌరశక్తి నాణ్యమైన ఉత్పత్తిని ఇస్తుంది. అంతకు మించి వాడితే సోలార్ ప్యానల్స్ మధ్య తగినంత దూరం లేక రేడియేషన్ తగ్గుతుందని దానివల్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కానీ జెన్‌కో మాత్రం నమ్మశక్యం కాని వాదన విన్పిస్తోంది.

బిడ్డింగ్‌లో ఎంపికైన కంపెనీలన్నీ 21 శాతం పీఎల్‌ఎఫ్‌కు హామీ ఇస్తాయని చెబుతోంది. ప్లాంట్‌లో అక్కడక్కడా రీడింగ్ తీసుకుని సగటున మొత్తానికి పీఎల్‌ఎఫ్ లెక్కగట్టాలనేది బిడ్డింగ్‌లో షరతు. దీనివల్ల రేడియేషన్ ఎక్కువగా ఉన్నచోట రీడింగ్ తీసి, దాన్నే కొలమానంగా చూపించే వీలుంది. దీనికి తోడు సూర్యరశ్మి సరిగా లేకపోతే, ఉత్పత్తి విషయంలో కాంట్రాక్టర్‌కు ఏ విధమైన సంబంధమూ ఉండదనే వెసులుబాటు కూడా కల్పించారు.
 
ప్యానల్స్ పేరుతో మాయాజాలం...
సోలార్ ప్లాంట్‌లో ప్యానళ్ళే కీలకం. ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం దీనికే ఖర్చవుతుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి నాణ్యత వీటిపైనే ఆధారపడి ఉంది. జెన్‌కో మెగావాట్‌కు రూ. 6.26 కోట్ల చొప్పున సోలార్ కాంట్రాక్టులు ఇవ్వబోతోంది. అంటే 5 బ్లాకుల్లో 500 మెగావాట్లకు రూ. 3,130 కోట్లు అంచనా వ్యయం అన్నమాట. ఇందులో 60శాతం అంటే.. రూ. 1,878 కోట్లు ప్యానల్స్‌కు అవుతుంది. ఒక్కో మెగావాట్‌కు 3,500 సోలార్ ప్యానల్స్ అవసరం. పీఎల్‌ఎఫ్ కోసం మరో 17 శాతం ఎక్కువ ప్యానెల్స్ ఉపయోగిస్తున్నట్లు జెన్‌కో చెబుతోంది.

ఈ లెక్కన సుమారు మరో 500 అదనంగా చేరిస్తే మెగావాట్‌కు 4,000 ప్యానెల్స్ వాడనున్నారు. అంటే 500 మెగావాట్లకు దాదాపు 20 లక్షల ప్యానల్స్ వాడతారన్నమాట. ప్యానెల్స్ కోసం రూ.1,878 కోట్లు ఖర్చుచేస్తున్నారని తేలింది కాబట్టి.. ఒక్కో ప్యానల్‌కు రూ. 9,370 చెల్లిస్తున్నారని అర్ధమౌతోంది. వాస్తవానికి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ ప్యానల్ ఖరీదు ప్రస్తుతం 96 డాలర్లు (సుమారు రూ. 6,500) మాత్రమే. ఈ లెక్కన ఒక్కో ప్యానల్‌కు  రూ. 2,870 (9,370-6,500)చొప్పున, 20 లక్షల ప్యానల్స్‌కు ఏపీ జెన్‌కో అదనంగా చెల్లిస్తున్నమొత్తం రూ. 574 కోట్లు అన్నమాట. 

మన దేశ వాతావరణ పరిస్థితుల ప్రకారం తయారయ్యే నాణ్యమైన సోలార్ ప్యానెల్ కూడా రూ. 7,500 వేల లోపే లభిస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ కాంట్రాక్టులో స్వదేశీ ప్యానళ్లు ఉపయోగించాలనే నిబంధన లేదు. అంటే చౌకగా దొరికే విదేశీ ప్యానెల్స్ మాత్రమే ఉపయోగిస్తారని వేరే చెప్పనక్కరలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement