రూ.2,246 కోట్లకు స్కెచ్చేశారు
- మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి అడ్డగోలు అవినీతి
- రూ.600 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులకు రూ.2,846 కోట్లు కేటాయింపు
- బీటీపీ, పేరూరు బ్రాంచ్ కెనాల్, హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ అంచనాల్లో గోల్‌మాల్
- నిర్మాణ వ్యయం తగ్గినా ఇష్టానుసారంగా అంచనాల పెంపు
- అస్మదీయ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు సర్కారు ఎత్తులు
- ప్రజల సొమ్మునే ఎన్నికల పెట్టుబడిగా మార్చుకుంటున్న ప్రభుత్వ పెద్దలు
అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి వరద పారిస్తున్నారు. మంత్రులు, తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రూ.వేల కోట్లు దండుకోవడమే లక్ష్యంగా ప్రాజెక్టుల అంచనాలను అనూహ్యంగా పెంచేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు అవసరయ్యే పెట్టుబడిని ఇప్పటినుంచే సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ప్రజల సొమ్మునే ఎన్నికల పెట్టుబడిగా మార్చుకుంటున్నారు.
రూ.వందల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులకు రూ.వేల కోట్లు కేటాయిస్తుండడం అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఒకపక్క సిమెంట్, ఉక్కు, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి వ్యయం తగ్గిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని కూడా తగ్గించాల్సింది పోయి, విపరీతంగా పెంచేయడం పట్ల సాగునీటి రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ తరహా భారీ దోపిడీకి తెరలేచింది. కేవలం రూ.600 కోట్లతో పూర్తయ్యే మూడు ప్రాజెక్టులకు రూ.2,846 కోట్లకు పైగా కేటాయించి, ప్రజాధనం కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దాదాపు రూ.2,246 కోట్ల స్వాహాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
మూడు ప్రాజెక్టులు... రూ.2,846 కోట్ల అంచనాలు
అనంతపురంలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎన్టీఆర్ ఆశయం’ పేరిట జిల్లాకు రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో పేరూరు ప్రాజెక్టు(అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు–యూపీపీ) ఫేజ్–1కు రూ.850 కోట్లు, భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఫేజ్–1కు రూ.450 కోట్లు ప్రకటించారు. వీటితోపాటు హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ కింద 80,600 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు రూ.85 కోట్లు కేటాయించారు. కానీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ల రూపకల్పనలో అంచనాలను పెంచేశారు.
పేరూరు ప్రాజెక్టు ఫేజ్–1 అంచనా వ్యయం రూ.1,149 కోట్లు, భైరవానితిప్ప ప్రాజెక్టు ఫేజ్–1 అంచనా వ్యయం రూ.1,361 కోట్లు, హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ అంచనా వ్యయం రూ. 336 కోట్లకు పెరిగింది. దీంతో ఈ మూడు ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.2,846 కోట్లకు చేరుకుంది. ఇందులో 36వ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం పెంపునకు సంబంధించి ప్రభుత్వం గతంలోనే జీవో జారీ చేసింది. మిగిలిన రెండు ప్రాజెక్టుల పనులకు నేడో రేపో పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేసింది.
రూ.2,246 కోట్ల దోపిడీకి రంగం సిద్ధం
పేరూరు(యూపీపీ) ఫేజ్–1లో భారీ దోపిడీకి తెరలేపారు. పేరూరు డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు. దీనికింద ఉన్న ఆయకట్టు రూ.10 వేల ఎకరాలు. ఈ ప్రాజెక్టుకు రెండు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీళ్లు ఇవ్వొచ్చు. ఇందులో ఒకటో ప్రత్యామ్నాయానికి రూ.30 కోట్లు, రెండో ప్రత్యామ్నాయానికి రూ.170 కోట్లు ఖర్చవుతుంది. ఇంత నామమాత్రపు ఖర్చుతో పూర్తయ్యే పనులకు ఏకంగా రూ.1,149 కోట్లు కేటాయించారు.
దోపిడీ నంబర్–1
పేరూరు ప్రాజెక్టు ఫేజ్–1కు సంబంధించి రూ.1,149 కోట్లతో డీపీఆర్‌ను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కల్యాణదుర్గం, ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి మండలాల్లో 57 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మాణంతోపాటు కనగానపల్లి మండలంలోని తోమరవాండ్లపల్లిలో 1.2 టీఎంసీలు, పుట్టకనుమలో 0.6 టీఎంసీల సామర్థ్యంతో రెండు రిజర్వాయర్లు నిర్మించేలా డీపీఆర్ సిద్ధం చేశారు. దీంతోపాటు పేరూరు డ్యామ్‌కు 1.8 టీఎంసీలు అందించి డ్యామ్ పరిధిలో పది వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించనున్నారు. అధికారులు పంపిన డీపీఆర్ రూ.1149 కోట్లు. కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం లెక్కిస్తే ఈ ప్రాజెక్టు ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాదు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో ఆయకట్టుకు నీళ్లంచ్చేందుకు ఎకరాకు రూ.లక్ష మేర కాస్ట్ బెనిఫిట్ రేషియోగా నిర్ధారించారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటి వరకూ చేసిన ప్రాజెక్టుల్లో సగటున ఎకరాలకు రూ.1.50 లక్షలు ఇస్తారు.
అనంతపురం లాంటి కరువు ప్రాంతాలను ప్రత్యేకంగా పరిగణించి మరో రూ.లక్ష పెంచి రూ.2.50 లక్షల వరకూ అనుమతి ఇస్తారు. కానీ, 10 వేల ఎకరాల ఆయకట్టుకు రూ.1,149 కోట్లతో పంపిన డీపీఆర్ లెక్కల ప్రకారం ఎకరాకు కాస్ట్ బెనిఫిట్ రేషియో రూ.11.39 లక్షలు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వదనే నెపంతో తోమరవాండ్లపల్లి, పుట్టకనుమ వద్ద రిజర్వాయర్ నిర్మించేలా డీపీఆర్‌లో పొందుపరిచారు.
దీనికింద ఆయకట్టును పేర్కొనలేదు. రిజర్వాయర్లను నిర్మించిన తర్వాత ఆయకట్టును గుర్తిస్తామంటున్నారు. పేరూరు కింద ఉన్న 10 వేల ఎకరాలతోపాటు ఈ రెండు రిజర్వాయర్ల కింద ఉన్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని రూ.1,149 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి కోసమే రిజర్వాయర్లను పేర్కొన్నారు తప్ప వీటిపై చిత్తశుద్ధి లేదనే విషయం తెలుస్తోంది. పేరూరు డ్యామ్ పనుల్లో రూ.949 కోట్లకుపైగా కొట్టేయడానికి స్కెచ్ వేశారు.
ప్రత్యామ్నాయం–1
హంద్రీ–నీవా ప్యాకేజీలో మడకశిర బ్రాంచ్ కెనాల్‌లో 26 కిలోమీటర్ నుండి(6వ లిప్ట్ తర్వాత) తురకలాపట్నం వంకలోకి నీళ్లు వదలాలి. అక్కడి నుండి పేదకోడిపల్లి మీదుగా పావుగడ మండలంలోని నాగలమడక చెరువులోకి నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి పేరూరు డ్యామ్‌కు నీళ్లు అందుతాయి. మొత్తం 20 కిలోమీటర్లు నీరు ప్రయాణం చేయాలి. ఇందులో 4 కిలోమీటర్లు కర్ణాటకలో, తక్కిన 16 కిలోమీటర్లు అనంతపురం జిల్లాలో ప్రవహించాలి. పైగా ఎక్కడా లిప్ట్ అవసరం లేదు. గ్రావిటీ ద్వారా నీళ్లందుతాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ వద్ద 650 అడుగుల ఎత్తు ఉంటే, పేరూరు డ్యామ్ 530 అడుగుల ఎత్తులో ఉంది. ఈ మార్గం ద్వారా నీళ్లివ్వాలంటే వంకను వెడల్పు చేయాలి. దీనికి కేవలం రూ.10 కోట్లు ఖర్చవుతుంది. ఒకవేళ కర్ణాటక నుంచి పైపులైన్ ద్వారా నీళ్లు తీసుకురావాలంటే రూ.30 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.
ప్రత్యామ్నాయం–2
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో హంద్రీ–నీవా ప్రాజెక్టు పరిధిలో బోరంపల్లి లిఫ్ట్ నుంచి కంబదూరు మీదుగా పేరూరు డ్యామ్‌కు నీళ్లిచ్చేందుకు అధికారులు సర్వే చేశారు. రూ.85 కోట్లు ఖర్చు చేస్తే కల్యాణదుర్గం, కంబదూరు మండలాల్లోని ఆయకట్టుకు నీళ్లిస్తూ పేరూరు డ్యామ్‌కు నీళ్లు తీసుకెళ్లొచ్చని ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన వైఎస్సార్ 2009 ఎన్నికల ప్రచారంలో పేరూరు డ్యామ్‌కు నీళ్లిస్తామని ప్రకటించారు.
అయితే, 2009లోనే ఆయన మృత్యువాత పడడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదు. మళ్లీ 2016లో ఈ పనులను తెరపైకి తెచ్చారు. ఏడేళ్ల తర్వాత చేపట్టే ఈ పనుల అంచనా వ్యయం ఏడాదికి 10 శాతం చొప్పున పెంచినా 70 శాతం పెరగాలి. వందశాతం పెంచినా రూ.170 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. కానీ, ప్రభుత్వం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1,149 కోట్లకు పెంచేయడం గమనార్హం.
దోపిడీ నంబర్–2
హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ పనుల్లో కూడా ప్రజాధనం లూటీ అవుతోంది. 36వ ప్యాకేజీ పనులను 2005లో ఓం–రే(జాయింట్ వెంచర్) సంస్థ దక్కించుకుంది. రూ.93.92 కోట్లతో 80,600 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు అప్పట్లో ఈ పనులు ప్రారంభించారు. ఇందులో రూ.38 కోట్ల పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. ఇక మిగిలింది రూ.55 కోట్ల పనులు. ఏడాదికి 10 శాతం చొప్పున ఈ పనుల అంచనా వ్యయం వందశాతం పెంచినా రూ.110 కోట్లు ఖర్చవుతుంది. భూ సేకరణకు మరో రూ.80 కోట్లు అవసరం. రెండూ కలిపి రూ.190 కోట్లతో 36వ ప్యాకేజీ పనులు పూర్తవుతాయి. కానీ, టీడీపీ ప్రభుత్వం ఏకంగా రూ.336.15 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపుల ద్వారా రూ.146.15 కోట్లు మింగేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లయింది.
దోపిడీ నంబర్–3
రాయదుర్గం నియోజకవర్గంలోని భైరవానితిప్ప ప్రాజెక్టు ఫేజ్–1కు రూ.450 కోట్లను ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ, డీపీఆర్‌లో మాత్రం అంచనాలను రూ.1,361 కోట్లకు పెంచేశారు. జీడిపల్లి రిజర్వాయర్ తర్వాత బోరంపల్లి లిఫ్ట్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని బీటీ ప్రాజెక్టుకు నీళ్లివ్వాలి. కాంట్రాక్టర్ల లెక్క ప్రకారం కిలోమీటర్‌కు రూ.2 కోట్ల చొప్పున లెక్కించినా రూ.వంద కోట్లతో ఈæప్రాజెక్టుకు నీళ్లివ్వొచ్చు. కానీ, అంచనా వ్యయాన్ని మాత్రం రూ.1,361 కోట్లకు చేర్చారు. మార్గంమధ్యంలో 110 చెరువులకు నీళ్లందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ పనుల్లో కనీసం రూ.1,261 కోట్లను జేబుల్లో నింపుకోవడానికి పథక రచన సాగించారు.