సాగునీరు విడుదల చేస్తారా.. లేదా.?
రసాభాసగా సమావేశం
ఈఈని నిర్బంధించే యత్నం
అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన రైతులు
గుడివాడ టౌన్ :
సాగునీరు విడుదల చేయకపోవడం అధికారులు నిర్లక్షానికి నిదర్శనమని రైతులు మండిపడ్డారు. శుక్రవారంఇరిగేషన్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన నీటి సంఘాల సమావేశం రసాభాసగా మారింది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అసలు సాగుకు నీరు ఇస్తారా.. ఇవ్వరా అంటూ పలువురు రైతులు, నీటి సంఘాలు, డీసీ అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైవస్ కాల్వ కింద సాగుచేసే రైతులకు, సాగునీరు విడుదల చేయకపోవడంతో నాట్లు వేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పోసిన నారు ముదిరిపోతుంటే వెనక పోసిన నారుమడులు నీరందక ఎండిపోతున్నాయని వాపోయారు. రైతులు ఎటూ తేల్చుకోలే సతమతమౌతున్నారని అన్నారు. ఎండిన నారును అధికారులు చూపుతూ నిరసన తెలిపారు. నీటిని విడుదల చేయకుండా తమను మభ్యపెట్టేందుకు అధికారులు చూస్తున్నారని విమర్శించారు. ఉయ్యూరు సమీపంలో రైవస్ కాల్వ ద్వారా వచ్చే నీటిని దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీని వలన దిగువకు నీరు రావడం లేదన్నారు. ఉయ్యూరు వద్ద రైవస్ కాల్వను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ అడ్డంకులన్నీ తొలగించాలని కోరారు. నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరిగేషన్ ఈఈ మోహనరావు స్పందిస్తూ ఈ ఏడాది ఈ ప్రాంతానికి మొత్తం 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. పుష్కరాల కారణంగా నీటì æఅవసరాల దృష్ట్యా నిల్వ ఉంచాల్సి వచ్చిందని అన్నారు, ఇప్పటికే పులిచింతల, పట్టిసీమల నుంచి పూర్తిస్థాయిలో నీటి విడుదల జరిగిందన్నారు. ఆది, సోమవారాల లోపు నీటిని విడుదల చేస్తామని సాగుకు పుష్కలంగా నీరందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ (చంటి), ఇరిగేషన్ డీఈ కొడాలి బాబు, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.