ఖరీఫ్ ఆశలు గల్లంతే!
1.84 లక్షల ఎకరాల్లో పడని నాట్లు
4.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డా
నీటి కొరతతో ఎండిపోయే ప్రమాదం
బ్యారేజ్ నుంచి అరకొరగా
నీటి విడుదల
మచిలీపట్నం:
ఖరీఫ్ సాగుపై ఆశలు గల్లంతవుతున్నాయి. సెప్టెంబరు నెల 15 రోజులు దాటినా పూర్తిస్థాయిలో కాలువలకు నీరు విడుదల చేయలేదు. ఖరీఫ్ సీజన్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా మంగళవారం నాటికి 4.50 లక్షల ఎకరాల్లో సాగు నమోదైనట్లు వ్యవసాయాధికారులు లెక్క తేల్చారు. మిగిలిన 1.84 లక్షల ఎకరాల్లో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. అరకొరగా సాగునీటిని విడుదల చేస్తుండటం, వరుణుడు గత పది రోజులుగా ముఖం చాటేయడంతో పైరు ఎండిపోయే దశకు చేరుతోంది. నీరు లేక ఇప్పటికే సాగు చేసిన వరిపైరులో ఎదుగుదల కనిపించటం లేదు. ఈ ఖరీఫ్ సీజన్ రైతుల కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.
సముద్రంలోకి వదులుతారు తప్ప...
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమైనా పూర్తిస్థాయిలో అన్ని కాలువలకు మూడు రోజులకు మించి సాగునీటిని విడుదల చేయలేదు. జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిసినా అప్పటికి సాగునీటిని కాలువలకు వదలలేదు. పుష్కరాల అనంతరం ప్రకాశం బ్యారేజీకి వరదనీరు వచ్చినా ఆ నీటిని సముద్రంలోకి వదిలారు తప్ప కాలువలకు విడుదల చేయని పరిస్థితి నెలకొంది. కృత్తివెన్ను మండలంలోని నీలిపూడి, కొమాళ్లపూడి, కృత్తివెన్ను, లక్ష్మీపురం, గరిసిపూడి తదితర ప్రాంతాలకు నేటికీ నీరు చేరలేదు. ప్రధాన కాలువలకు సక్రమంగా నీరు రాకపోవటంతో 15శాతానికి మించి ఈ మండలంలో వరినాట్లు పూర్తికాని దుస్థితి. బంటుమిల్లి చానల్‌లో మల్లేశ్వరం వంతెన వద్ద రెండు అడుగులకు మించి నీటిమట్టం పెరగటం లేదు. దీంతో రైతులు ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని పొలాలకు మళ్లించుకుంటున్నారు.
కలెక్టరు ముందుకే నీటి సమస్య
మచిలీపట్నం, పెడన, గూడూరు మండలాలకు సాగునీటిని అందించే రామరాజుపాలెం కాలువలకు పూర్తిస్థాయిలో నీరు విడుదల కాలేదు. 3,500 క్యూసెక్కుల నీటిని రైవస్ కాలువలకు వదిలితే రామరాజుపాలెం కాలువకు నీరు వచ్చే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి రైవస్ కాలువకు 2400 క్యూసెక్కులు వదిలారు. సాయంత్రానికి 2,800 క్యూసెక్కులకు పెంచారు. 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గాని రామరాజుపాలెం కాలువ శివారున ఉన్న బుద్దాలపాలెం, జింజేరు, తాళ్లపాలెం, కానూరు గ్రామాలకు నీరు చేరే పరిస్థితి లేదని నీటిపారుదలశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కానూరు, తాళ్లపాలెం, కొత్తమాజేరు, పూషడం, దాలిపర్రు, లంకపల్లి, యండకుదురు, దాలిపర్రు తదితర గ్రామాలకు చెందిన రైతులు సోమవారం కలెక్టర్ బాబు.ఎ వద్దకు వచ్చి తమ గోడను వెళ్లబోసుకున్నారు. ఓ అడుగు ముందుకు వేసిన తాళ్లపాలెం, కానూరు రైతులు మూడు రోజుల్లోగా నీరు రాకుంటే కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలకు దిగుతామని చెప్పారు.