రైతులంటే బాధ్యతలేని సీఎం
వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్ ధ్వజం
మైలవరం యార్డులో పెసర రైతులకు సంఘీభావం
మైలవరం:
రైతులకు సాగునీరు లేదు, మద్దతు ధర లేక విలవిల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆరోపించారు. మైలవరం మార్కెట్ యార్డులో వర్షానికి తడిచి మొలకలెత్తుతున్న పెసలను శుక్రవారం ఆయన పరిశీలించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో 14రోజులుగా పెసలు అమ్ముకోడానికి తీసుకవచ్చినుట్లు రైతులు తెలిపారు. రెండు రోజుల్లో పెసలు కొంటామన్న మార్కెట్ కమిటీ స్పందించడం లేదని రైతులు వాపోయారు. నిన్న కురిసిన వర్షానికి పెసలు తడిచిపోయి మొలకలెత్తుతున్నాయని రైతులు వాపోయారు. దీనిపై స్పందించిన జోగి మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి తడిచిన పెసలతో సహా కొనుగోలు చేయకుంటే మార్కెటింగ్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామన్నారు.
పెసలను కొనకపోతే ముట్టడిస్తాం
పుష్కరాల్లో 12 రోజులు హారతిలో పాల్గొంటున్న ముఖ్యమంత్రికి సమీపంలోని జూపూడిలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు కన్పించలేదన్నారు. ప్రభుత్వం క్వింటా పెసలు రూ.4850 చెల్లిస్తామని చెబుతున్నా ఇప్పటివరకు కొనుగోళ్లు చేపట్టలేదని, దళారులు క్వింటా రూ.4500 నగదు చెల్లిస్తామని వస్తున్నారన్నారు. క్వింటాకు రూ.6 వేలు మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోగి వెంట మైలవరం, రెడ్డిగూడెం మండలాల పార్టీ కన్వీనర్‌లు పామర్తి శ్రీనివాసరావు, మురళీ మోహనరెడ్డి, మైలవరం పట్టణ కన్వీనర్ షేక్ కరీమ్, మైనార్టి కన్వీనర్ షేక్ నన్నేబాబు, ఎన్. అజాద్, పి. శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి జి. స్వామిదాసు, ఉయ్యూరు సత్యనారాయణరెడ్డి, బుర్రి ప్రతాప్, రెడ్డిగూడెం, మైలవరం మండలాల నాయకులు పాల్గొన్నారు.