భర్తే చంపేశాడా?
చెరుకుపల్లి (రేపల్లె): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మరణించిన ఘటన చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం... గ్రామంలోని కొండవీటి భవాని(32), ఆమె భర్త గణేష్ మధ్య గత కొంత కాలంగా విభేదాలు చోటు చేసుకున్నాయి. మద్యం సేవించి తరచూ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల భవాని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పెద్దమనుషుల సమక్షంలో ఇకపై ఎటువంటి పొరపాట్లు చేయనని గణేష్ రాజీ కుదుర్చుకున్నాడు. కాగా, వారం రోజులుగా మద్యం సేవిస్తూ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. మంగళవారం 6వ తరగతి చదువుతున్న కుమార్తె విజయదుర్గ స్కూలు నుంచి సాయంత్రం 4.30గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తీసింది. ఇంటిలో అచేతనంగా పడిపోయి ఉన్న తల్లిని చూసి సమీపంలో ఉంటున్న అమ్మమ్మ, తాతయ్య రంగారావు, పద్మావతిలకు విషయం చెప్పి తీసుకువచ్చింది. వారు వచ్చి భవానిని చూడగా అప్పటికే మృతి చెంది ఉండటాన్ని గమనించి బావురమన్నారు. చుట్టుప్రక్కల వారు పోలీసులకు పిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి ఎస్సై అహ్మద్‌జానీ చేరుకుని పరిశీలించారు. అదేవిధంగా రూరల్ సీఐ పెంచలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని భవానీ మృతికిగల వివరాలను బంధువుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హత్యచేశాడని భావిస్తున్న భవానీ భర్త గణేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
భర్తే హత్య చేశాడని అనుమానం..
అల్లుడే తమ కుమార్తెను హత్యచేశాడని భవాని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా మద్యం సేవించి వచ్చి భార్యను, పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, మంగళవారం పిల్లలు స్కూలుకు వెళ్లిన తరువాత హత్యచేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.