
ఇందూరుకు ఐటీ హంగులు
నగరంలో ఐటీహబ్ ఏర్పాటుకు నిధులు
♦ తొలివిడతలో రూ. 25 కోట్లు కేటాయింపు
♦ పెట్టుబడులకు 60 కంపెనీల ఆసక్తి
♦ స్థానికంగా మెరుగుపడనున్న ఉద్యోగాలు
♦ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అవకాశాలు
♦ రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉండటం
♦ ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం
♦ ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ కవిత
వ్యవసాయ ఆధారిత నిజామాబాద్ జిల్లాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల స్థాపన దిశగా తొలి అడుగు పడింది. కేవలం హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమలను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా నిజామాబాద్‌లో కూడా ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న సర్కారు.. తాజాగా ఈ జాబితాలో నిజామాబాద్‌ను కూడా చేర్చింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
దీంతో రానున్న రోజుల్లో నిజామాబాద్ నగరంలో కూడా ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను స్థాపించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయినప్పటికీ దశాబ్దం క్రితమే జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పడ్డాయి. దీనికితోడు నిజామాబాద్ హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండటం, మెరుగైన రవాణా సౌకర్యాలుండటంతో ఇక్కడ ఈ ఐటీ పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాలో ఐటీ కంపెనీల స్థాపన జరిగితే ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.
జిల్లాకు చెందిన అనేక మంది విద్యార్థులు హైదరాబాద్, పూణే, బెంగళూరు వంటి మహా నగరాలతో పాటు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఐటీ కంపెనీల స్థాపన జరిగితే రానున్న రోజుల్లో స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఐటీ ఉద్యోగులు జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి. తద్వారా ఐటీ అనుబంధ వ్యాపారాలు పెరిగి నగరాభివృద్ధికి బాటలు పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమీపంలో ట్రిపుల్ ఐటీ..
బాసర ట్రిపుల్ ఐటీ నిజామాబాద్‌కు సమీపంలో ఉండటం ఒక అడ్వాంటేజ్. నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఉన్నత విద్యా సంస్థలో వేలాది మంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడి నుంచి వందలాది మంది ఐటీ కోర్సులు చేసిన అభ్యర్థులు హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉద్యోగ అవకాశాల కోసం వెళుతుంటారు. నిజామాబాద్‌లో ఐటీ పరిశ్రమల స్థాపన జరిగితే ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.
తొలి విడతలో రూ.25 కోట్లు
నిజామాబాద్‌లో ఐటీ హబ్ ఏర్పాటుకు తొలివిడతలో రూ.25 కోట్లు కేటాయిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి విడతలో మంజూరయ్యే ఈ నిధులతో ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ దిశగా పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఫలించిన కవిత చొరువ
నిజామాబాద్‌కు ఐటీ హబ్ మంజూరు కావడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరువ చూపారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చించి మొదటి విడతలో రూ.25 కోట్లు మంజూరు చేయించారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 60 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త సోదరుడు మహేష్‌గుప్త వివిధ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలతో చర్చించారు. ఇక్కడ కంపెనీల స్థాపనకు ఆసక్తి ఉన్న ఎన్‌ఆర్‌ఐల జాబితాను ఆదివారం ఎంపీ కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మహేష్‌గుప్తలు మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.