- నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి
అనంతపురం:
‘చట్టాలు బాగున్నాయని అందరూ చెబుతున్నారు.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. రాబోయే తరానికి ప్రతినిధులైన బాలికలపై అత్యాచారాలు, ఆకృత్యాలు బాధాకరం. మన దేశం నుంచి వీటిని తరిమికొట్టాలనే ఉద్దేశంతోనే మహా ఉద్యమం చేపట్టాం. ఈ బృహత్తర ఉద్యమంలో కోటి మంది భారతీయులను భాగస్వామ్యం చేస్తాం’ అని నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి స్పష్టం చేశారు. చిన్న పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, హక్కుల కోసం కైలాస్ సత్యార్థి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన యాత్ర సోమవారం కర్ణాటక నుంచి అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలో అడుగుపెట్టింది. జిల్లా సరిహద్దు కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద మంత్రులు పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, ఎంపీ నిమ్మల కిష్టప్ప, కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ ఖాజా మొహిద్దీన్, ఎమ్మెల్యే పార్థసారధి, ఇతర అధికారులు కైలాస్ సత్యార్థి, ఆయన సతీమణి సుమేధా సత్యార్థి, బృందానికి ఘన స్వాగతం పలికారు. కిలోమీటరు పాదయాత్ర చేపట్టిన అనంతరం జాతీయ రహదారి పక్కన జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాలికలపై లైంగిక వేధింపులు, క్రూరత్వం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. వీటిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బాలికలపై అత్యాచారాలు, బాల్య వివాహాలు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మొత్తం 15 వేల కేసులు రిజిస్టర్ కాగా అందులో కేవలం నాలుగు శాతం మాత్రమే శిక్షలు పడ్డాయన్నారు. 90 శాతం పెండింగ్ ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మన దేశం బాలలకు సురక్షితంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వారు చదివిన పాఠశాలలకు వెళ్లి ఒక గంట గడపాలని కోరారు. తద్వారా పిల్లలు, తల్లిదండ్రుల్లో పాఠశాల సురక్షితమనే భావన పెరుగుతుందన్నారు. ఈ విధానం ఏపీలో ఒక్కటే కాకుండా దేశమంతా జరిగితే మంచి ఫలితాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నేరుగా అనంతపురం నగరానికి చేరుకున్న కైలాస్ సత్యార్థి రాత్రి ఆర్డీటీ అతిథి గృహంలో బస చేశారు. మంగళవారం ఉదయం కర్నూలు జిల్లా బయలుదేరి వెళ్లనున్నారు.