మానవ వనరుల సక్రమ వినియోగం అవసరం
మానవ వనరుల సక్రమ వినియోగం అవసరం
Published Wed, Sep 7 2016 7:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
తాడేపల్లిగూడెం: మానవ వనరులను సక్రమంగా ఉపయోగించాల్సిన అవసరం దేశానికి ఎంతో ఉందని ఆదికవి నన్నయ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ముత్యాలునాయుడు అన్నారు. వికాస్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వాసవీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మానవవనరుల అభివద్ధి కేంద్రాన్ని (హెచ్‌ఆర్‌డీ సెంటర్) బుధవారం ఆయన ప్రారంభించారు. యువత సత్తా ప్రపంచానికి తెలియాలంటే మానవ వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని అన్నారు. యువతలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు నన్నయ వర్సిటీ ద్వారా వికాస్ సంస్థ సహకారంతో హెచ్‌ఆర్‌డీ సెంటర్లను ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు.
గోదావరి జిల్లాలో 16 కేంద్రాలు.. ఉభయగోదావరి జిల్లాల్లో 16 హెచ్‌ఆర్‌డీ కేంద్రాలు ఎంపిక చేయాలనేది లక్ష్యం కాగా, 11వ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేశామని వీసీ అన్నారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన 250 కళాశాలలు, లక్ష మందికి పైగా విద్యార్థులున్న ఏకైక యూనివర్సిటీగా నన్నయ వర్సిటీ నిలిచిందని చెప్పారు. వర్సిటీలో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టడంతో పాటు డిమాండ్ ఉన్న కోర్సులను ఏర్పాటుచేయడం, పరిస్థితులకు అనుగుణంగా కోర్సులను మార్పులు చేయడం వంటివి చేస్తున్నామని చెప్పారు.
45 రోజులపాటు శిక్షణ .. కాకినాడలోని వికాస్ కేంద్రంతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుందని వీసీ చెప్పారు. డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హెచ్‌ఆర్‌డీ కేంద్రం ద్వారా 45 రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా నైపుణ్యాలు పెంచడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కషిచేస్తున్నామన్నారు. కళాశాలకు రహదారి సౌకర్యం ఏర్పాటుచేయడానికి సహకారం అందిస్తామని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు చెప్పారు.
Advertisement
Advertisement