పుష్కర వేళ.. ఇలా వెళ్దాం | it's puskara time | Sakshi
Sakshi News home page

పుష్కర వేళ.. ఇలా వెళ్దాం

Published Wed, Aug 10 2016 7:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

పుష్కర వేళ.. ఇలా వెళ్దాం

పుష్కర వేళ.. ఇలా వెళ్దాం

బృహత్తర కార్యక్రమానికి మరో రోజులో తొలి అడుగు పడనుంది. మన రాష్ట్రమే కాదు.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు.. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల  నుంచి కోట్లాదిమంది భక్తులు కృష్ణమ్మ పుష్కర స్నానమాచరించి పునీతమవ్వాలని ఇప్పటికే బయల్దేరి ఉంటారు. కానీ, విజయవాడ నగరంలో ఇంకా జరుగుతున్న పుష్కరాలు, పలు అభివృద్ధి పనుల నేపథ్యంలో కొంతమేర రూట్‌మ్యాప్‌లో గజిబిజికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి కోసం.. వాహనాలు ఎక్కడ దిగాలి? ఘాట్‌కు ఎలా చేరుకోవాలి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం.
 
శాటిలైట్‌ బస్‌స్టేషన్లు : 6
– ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం
– వైవీరావు ఎస్టేట్‌
– జాకీర్‌ హుస్సేన్‌ కళాశాల (ఇబ్రహీంపట్నం)
– వీటీపీఎస్‌ ఏ కాలనీ గ్రౌండ్‌
– కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల
– పెదకాకాని
 
శాటిలైట్‌ రైల్వేస్టేషన్లు : 4 
– రాయనపాడు
– గుణదల
– మధురానగర్‌
– కృష్ణా కెనాల్‌
శాటిలైట్‌ బస్, రైల్వేస్టేషన్ల వద్ద పుష్కర నగర్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సకల సౌకర్యాలూ ఉంటాయి. అక్కడి నుంచి ఘాట్‌ల వద్దకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. 
 
పార్కింగ్‌ ప్రదేశాలు : 121 
ఉచిత బస్సులు : 740
 
 
గుంటూరు వైపు నుంచి..
– అమరావతి, ధ్యానబుద్ధ ఘాట్‌ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే యాత్రికులు అమరావతి ఘాట్‌కు చేరుకోవచ్చు. ఇక్కడే ధ్యానబుద్ధ ఘాట్‌ కూడా ఉంది. గుంటూరు నుంచి నేరుగా అమరావతిలోని గుంటూరు రోడ్డు లేదా విజయవాడ రోడ్డు లేదా సత్తెనపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన పుష్కర నగర్‌కు చేరుకోవచ్చు. ప్రయివేట్‌ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఏర్పాటుచేసిన బస్సుల్లో ఘాట్‌ల వద్దకు చేరుకోవచ్చు. సుమారు 1.5 కిలోమీటరు దూరంలో ఉండే ఈ ఘాట్‌లకు నడుచుకుని అయినా వెళ్లవచ్చు. 
– సీతానగరం ఘాట్‌ :
 గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై నుంచి వచ్చేవారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న సీతానగరం ఘాట్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ 8 పుష్కరనగర్‌లు ఏర్పాటు చేశారు. పాత జాతీయరహదారిలో 3, జాతీయ రహదారిపై 3, కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద ఒకటి, మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రి వద్ద ఒకటి పుష్కర ఘాట్‌ను సిద్ధం చేశారు. ప్రైవేట్‌ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ఉండవల్లి సెంటర్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న పుష్కర ఘాట్‌కు నడిచే వెళ్లాలి. 
 
హైదరాబాద్‌ నుంచి..
ముక్త్యాల ఘాట్‌ :
 హైదరాబాద్‌ నుంచి వచ్చే భక్తులు ముక్త్యాల భవానీ ఘాట్‌కు వెళ్లాలంటే 65వ నంబర్‌ జాతీయ రహదారిలోని షేర్‌మహ్మద్‌పేట అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని ముక్త్యాల భవానీ ఘాట్‌కు వెళ్లాలి. వెళ్లే దారిలో సీమ పందుల పెంపక కేంద్రం సమీపంలో పుష్కర నగర్‌ ఏర్పాటు చేశారు. ప్రయివేట్‌ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్‌కు చేరుకోవచ్చు. 
వేదాద్రి ఘాట్‌ :
  వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఘాట్‌కు వెళ్లాలంటే చిల్లకల్లు నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. గౌరవరం నుంచి వేదాద్రి 10 కిలోమీటర్లు. 65వ నంబర్‌ జాతీయ రహదారి కొణకంచి అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్లు వెళ్లాలి. భక్తులు సులభంగా తెలుసుకునేందుకు ప్రధాన సెంటర్‌లలో రూట్‌ మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. 
పవిత్ర సంగమం ఘాట్‌ : కృష్ణా, గోదావరి నదులు కలిసే చోటు పవిత్ర సంగమం ఘాట్‌. పుష్కరాలకు హైదరాబాద్‌.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఎక్కువగా స్నానాలు చేసే అవకాశం ఉంది. ఈ ఘాట్‌ వద్ద స్నానాలు చేయాలనుకునే భక్తులు ప్రయివేట్‌ వాహనాల్లో వస్తే ఇబ్రహీంపట్నంలోని ట్రక్‌ టెర్మినల్‌ దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడే పుష్కర నగర్‌ ఉంటుంది. ప్రయివేట్‌ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్‌ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది.  ఆర్టీసీ బస్సుల్లో వచ్చే హైదరాబాద్‌.. ఆపై ప్రాంతాల భక్తులు ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ సమీపంలో జాకీర్‌ హుస్సేన్‌ కాలేజీ వరకూ చేరుకోవాలి. అక్కడే పుష్కర నగర్‌ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఘాట్‌కు ఆర్టీసీ ఉచిత సర్వీసుల్లో చేరుకోవచ్చు. ఇక మైలవరం, భద్రచలం కొండపల్లి నుంచి వచ్చే వాహనాలు వీటీపీఎస్‌ ప్లే గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన పుష్కర నగర్‌ వద్ద ఆగాల్సి ఉంటుంది. 
భవానీ, పున్నమి ఘాట్‌లు :
 హైదరాబాద్‌.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భవానీ, పున్నమి ఘాట్‌లలో పుష్కర స్నానం చేయాలనుకుంటే.. ప్రయివేట్‌ వాహనమైనా, ఆర్టీసీ బస్సు అయినా భవానీపురం దర్గా వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్‌ వద్ద ఆగాలి. అక్కడి నుంచి నడుచుకుని ఈ రెండు ఘాట్‌లకూ చేరుకోవచ్చు. 
దుర్గాఘాట్‌ :
 బెజవాడ దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రికి సమీపంలో ఉన్న దుర్గాఘాట్‌లో పుణ్యస్నానం చేయాలనుకునే దూరప్రాంతపు భక్తులు భవానీపురం దర్గా వద్ద అయినా దిగవచ్చు. లేదంటే విజయవాడలోని వైఎస్సార్‌ కాలనీ సమీపంలోని వైవీ రావు ఎస్టేట్‌ వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్‌లో దిగవచ్చు. అక్కడి నుంచి దుర్గాఘాట్‌తో పాటు భవానీ, పున్నమి ఘాట్‌కు ఉచిత బస్సులు నడుస్తాయి. 
 
హంసలదీవి కృష్ణా సాగర సంగమం :
 హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చేవారు హంసలదీవిలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతంలో పుణ్యస్నానం చేయాలనుకుంటే.. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించవచ్చు. విజయవాడ నుంచి అవనిగడ్డకు నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అవనిగడ్డ నుంచి కోడూరు.. ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి రావాలి. అక్కడి నుంచి సముద్రతీరంలో డాల్ఫిన్‌ భవనం వద్ద పుష్కర నగర్‌ ఉంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతానికి చేరుకోవచ్చు. ప్రయివేట్‌ వాహనాలైతే కోడూరు నుంచి దింటిమెరక గ్రామం.. పాలకాయతిప్ప నుంచి సముద్రం తీరంలోని పుష్కర నగర్‌కు చేరుకోవచ్చు. 
 
భారీ వాహనాల మళ్లింపు ఇలా..
– విజయవాడ నుంచి రోజూ విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వెళ్లే భారీ వాహనాల కోసం పుష్కరాల 12 రోజులూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను కంచికచర్ల, ఇబ్రహీంపట్నం నుంచి మళ్లిస్తారు. కంచికచర్ల మీదుగా జుజ్జూరు, జమలాపురం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం మీదుగా కొండపల్లి, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌కు చేరవేస్తారు. 
– విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్‌ జంక్షన్‌ నుంచి రూటు మారుస్తారు. 
 
740 ఆర్టీసీ ఉచిత సర్వీసులు
కృష్ణా పుష్కరాలకు విజయవాడలో 740 ఉచిత సిటీ బస్సులు నడుపుతున్నారు. శాటిలైట్‌ బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పుష్కర పార్కింగ్‌ ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి మూడు నిమిషాలకు ఒక ఉచిత బస్సు ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీలోని శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ వరకూ వస్తాయి. అక్కడి నుంచి నగరంలోని ఆరు ఘాట్లకు వెళ్లడానికి  వీలుగా 100 ఉచిత బస్సుల్ని ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు వైవీ రావు ఎస్టేట్‌లోని శాటిలైట్‌ బస్‌స్టేషన్‌ వద్ద ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 65 బస్సులు ఉంటాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చే బస్సులు ఇబ్రహీంపట్నంలోని జాకీర్‌ హుస్సేన్‌ గ్రౌండ్‌లో ఉన్న శాటిలైట్‌ బస్‌స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 45 ఉచిత బస్సులు నడుస్తాయి. తిరువూరు, భద్రాచలం నుంచి వచ్చే బస్సులు వీటీపీఎస్‌ కాలనీలో శాటిలైట్‌ స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి 10 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పుష్కర ఘాట్లకు మూడువేల బస్సులు నడుపుతున్నారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ సిటీ బస్‌స్టేషన్‌గా నడుస్తుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement