నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు | jabs with skills only | Sakshi
Sakshi News home page

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు

Published Wed, Aug 24 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగావకాశాలు

ఏయూ క్యాంపస్‌:  ఉద్యోగాలకు కొదవ లేదని, అవసరమైన నైపుణ్యాలను పొందడమే ప్రధానమని  ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయ భాస్కర్‌ అన్నారు.  బుధవారం ఉదయం ఏయూ అసెంబ్లీ మందిరంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల గ్రాడ్యుయేషన్‌ డేలో ఆయన మాట్లాడారు. డిగ్రీ విద్య కేవలం అవకాశాన్ని మాత్రమే చూపగలదని, సామర్థ్యాలను పరీక్షించిన తరువాతే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.  నేడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత సవాళ్లతో కూడిన సమాజం స్వాగతం పలుకుతుందని, దీన్ని దష్టిలో పెట్టుకుని అభ్యసనం నిరంతర ప్రక్రియగా సాగాలని సూచించారు.
సమాజాన్ని మార్చగలిగే ప్రబల శక్తి విద్యే : గంటా
అంతకుముందు  రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ.. సమాజాన్ని మార్చగలిగే ప్రబల శక్తి విద్యేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 17.5 శాతం నిధులు కేటాయించిందన్నారు. ఆర్థ్ధికంగా ఇబ్బందులు, లోటు బడ్జెట్‌ ఉన్నప్పటికీ విద్యా రంగానికి రూ.21 వేల కోట్లు వెచ్చిస్తోందన్నారు.  విద్యార్థులు బాధ్యతాయుతమైన  పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అకడమిక్‌ క్యాలెండర్‌ రూపొందించి సకాలంలో నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇకపై అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నేడు విద్యార్థులు నిర్ధారించుకున్న లక్ష్యమే భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందన్నారు.
వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అవసరమైన జ్ఞానాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం ఎంతో అవసరమన్నారు. పరిశోధన రంగాలలో విస్తృత అవకాశాలున్నాయని, సృజనాత్మకంగా పనిచేయడం ఎంతో అవసరమన్నారు. సమాజాభివృద్ధికి తోడ్పడే దిశగా యువతరం నిలవాల్సి ఉందన్నారు. 
అవంతి విద్యా సంస్థల చైర్మన్, పార్లమెంట్‌ సభ్యుడు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ. 3500 కోట్లు  వెచ్చిస్తోందన్నారు. అనంతరం వివిధ విభాగాలలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలను, జ్ఞాపికలను అతిథులు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ సి.పి.వి.ఎన్‌.జె మోహన్‌ రావు, డాక్టర్‌ వి.ఎస్‌.వి ప్రభాకర్, బి.సత్యం, డాక్టర్‌ సి.హెచ్‌ దివాకర్, డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, డాక్టర్‌ జి.ఆదినారాయణ రావు, ఆచార్య చందు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement