- –నేడు 9న జాలాది జయంతి
- – శరత్‌బాబు, చంద్రబోస్‌కు సత్కారం
జానపద జాబిలి జాలాది
Published Mon, Aug 8 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
ఎన్‌ఏడీ జంక్షన్ : జాలాది అంటే జానపదమే గుర్తుకు వస్తుంది. ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’... ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’.. ఇలా ఎన్నో... ఎన్నెన్నో జానపదాలు ఆయన కలం నుంచి జాలువారాయి... జానపదమే కాకుండా పుణ్యభూమి నాదేశం నమోనమామీ... ధన్యభూమి నాదేశం సదా స్మరామి... అంటూ దేశభక్తిని చూపి ధన్యజీవి అయ్యారు మన జాలాది. ఆయనది ఆదర్శ జీవితం. తండ్రితరం నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న సంప్రదాయం వారిది. ఇమ్మానియల్ (జాలాది నారాయణ చౌదరి), అమతమ్మ దంపతులకు ఐదో సంతానంగా జాలాది రాజారావు జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షకు గురై ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన కలం నుంచి జాషువా శైలి తొంగిచూస్తుంటుంది. జాలాది తన పాటల ద్వారా సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారు. ఆగస్టు 9న ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
బాల్యం, విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా గుడివాడ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు. ఇక్కడ ఆయనకు కులం అడ్డుగోడైంది, పాఠశాలలోకి రానివ్వకుండా బయట కూర్చొని ఇసుకలో అక్షరాలు దిద్దమనేవారు. ఇలా ఇబ్బందులతోనే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పూర్తి చేశారు. అప్పటికే ఆయన చిన్నచిన్న కవితలు రాయడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులు పండగలు, విశిష్టమైన రోజుల్లో మంచి పాట రాయరా రాజా అని అడిగేవారట.
డ్రాయింగ్ మాస్టారుగా..
విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం రాయివలసలో డ్రాయింగ్ మాస్టారుగా ఉద్యోగంలో చేరారు. అందరిచే రాయివలస మాస్టారుగా మన్ననలు పొందారు. ఇలా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఉద్యోగం చేస్తూనే వయోజన విద్య, నాటకాలు, నాటికలు రచనలు నిర్వహణ చేసేవారు. 1968లో ఉద్యోగానికి రాజీనామా చేశారు.
మరఫురాని పాటలు
సినీరంగంలో ప్రవేశించిన ఆయన మరఫురాని పాటలను అందించారు. ప్రాణం ఖరీదు సినిమాలో ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు’ పాటలో మనిషి జీవితంలో తారసపడే జీవిత సత్యాలు దొరుకుతాయి. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా... పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా... బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో... గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో... అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే... సీము నెత్తురు పారే తూము ఒక్కటే... కూతనేర్చి నోల్ల కులం కోకిలంటరా... ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా... ఈ పాటలు ఈ నాటికీ జనం హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’ పాట బతుకు చిత్రాన్ని చూపిస్తోంది. పుణ్యభూమి నాదేశం నమో నమామి.. ధన్యభూమి నాదేశం సదా స్మరామి పాట జాతీయ దినాల్లో ఏవేదికమీదైనా వినిపిస్తోంది.
నేను రచయితని...
నేను కవిని కాను రచయితని మాత్రమేనని చాలా వేదికల్లో జాలాది స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా ఊహాజనితంగా కవి రచనలు ఉంటాయి. రచయిత రాసినవి వాస్తవాలకు జీవితాలకు దగ్గరగా ఉంటాయన్నది ఆయన వాదన. ఈయన వాదంలో వాస్తవమున్నది. ఇందుకు ఆయన పాటలే ఉదాహరణగా నిలుస్తాయి. ఈయన సుమారు 280 సినిమాలకు 1200 పాటలు పాటలు రాశారు. ఎన్‌టీఆర్, మోహన్‌బాబు సినిమాలకు ఎక్కువ పనిచేశారు. చాలా పాటలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఉత్తమ పాటల రచయితగా ప్రశంసలు పొందారు.
నచ్చిన కవులు
శ్రీశ్రీ రచనలంటే చాలా ఇష్టమంటారు ఆయన. కొసరాజువంటి కవుల్ని ఆయన ఆరాదించేవారు. అయితే వీరి ప్రభావం లేకుండా తనదైన శైలిలో రచనలు చేశారు.
రచనలు
జాలాది పలు కవితలు, నాటికలు, బుర్రకథలు రాశారు. అమర జీవి, తండ్రి సమాధి, కారుమేఘాలు, గాజుపలకలు, విశ్వమోహిని, వంటి పలు రచనలు చేశారు.
తుది మజిలి
జీవీఎంసీ 42వ వార్డు శాంతినగర్‌లో ఉన్న కుమారుడు శ్రీనివాసరావు వద్ద చివరి మజిలీ గడిచింది. 2011 అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారు. అప్పటినుంచి జాలాది చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాకారులను గౌరవిస్తూ కళారంగానికి సేవచేస్తున్నారు.
నేడు జయంత్యుత్సవాలు
కళాభారతి ఆడిటోరియంలో జాలాది జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినీ నటుడు శరత్‌బాబు, పాటల రచయిత చంద్రబోస్‌కు ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జాలాది రాజారావు కుమార్తె జాలాది విజయ ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement