జనం మధ్యకు బీసీ కమిషన్‌ | janam madyaku bc commission | Sakshi
Sakshi News home page

జనం మధ్యకు బీసీ కమిషన్‌

Published Fri, Dec 2 2016 12:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:25 PM

janam madyaku bc commission

 ద్వారకాతిరుమల : బీసీ రిజర్వేషన్ల జాబి తాలో మార్పులు, చేర్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్‌  గురువారం క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. ద్వారకాతిరుమల మండలం కొమ్మర, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామాలతోపాటు తణుకు పట్టణంలో జస్టిస్‌ కేఎల్‌ మంజునాథ, కమిషన్‌ సభ్యులు కాపులు, బీసీల ఆర్థిక, సామాజిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పలుచోట్ల పేదల ఇళ్లకు వెళ్లారు. కాపులు, బీసీ వర్గాల వారితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కుల సంఘాల పెద్దల నుంచి వినతులు స్వీకరించారు. ద్వారకాతిరుమల మండలం కొమ్మరలో వివిధ కులాలకు చెందిన నాయకులు  వాదనలు వినిపించారు. తమ కులస్తులు పేదరికంలో మగ్గుతున్నారని ఎవరికి వారు మొరపెట్టుకున్నారు. గోపాలపురం నియోజకవర్గ బీసీ సంఘ కన్వీనర్‌ కూరాకుల బుజ్జి మంజునాథ కమిషన్‌ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారని, మిగిలిన వారంతా అగ్రకులాల వారేనని వివరించారు. అన్ని రంగాల్లో ముందున్న కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం సమంజసం కాదన్నారు. ద్వారకాతిరుమల మండల కాపు సంఘం అద్యక్షుడు పుప్పాల మురళి, కాపు నేత అంబటి గాంధీ, తదితరులు కమిషన్‌ కు వినతిపత్రం సమర్పించారు.  కాపుల్లో ఎంతోమంది వెనుకబడి ఉన్నారని, కూలి పనులకు వెళితేనే గాని రోజు గడిచే పరిస్థితి లేదని వివరించారు. వాస్తవ పరిస్థితులను కమిషన్‌  క్షుణ్ణంగా పరిశీలించి కాపులకు బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొమ్మర గ్రామానికి చెందిన మహిళ తీగల కనక మహాలక్ష్మి మాట్లాడుతూ కాపు కులానికి చెందిన తనకు నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్‌ తోట ఉందని తెలిపింది. ఆ భూమిలో గతంలో వేసిన బోరు పాడైందని, కొత్తబోరు కోసం అర్జీ పెట్టుకుని నెలలు గడుస్తున్నా అధికారుల్లో స్పందన లేదని వివరించింది. తనలాంటి వారు ఎంతోమంది బోర్లు పాడై, పంటలు పండక పొలాలను అమ్ముకుంటున్నారని చెప్పింది. బోరు వేయాలంటే ఎంతోకొంత పొలం అమ్ముకోవాల్సిందేనని, ఈ రకంగా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పింది. అనంతరం గ్రామంలో ఎంతమంది గ్యాస్‌ వినియోగిస్తున్నారు, ఎంతమంది కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారనే దానిపై బీసీ కమిషన్‌  వివరాలు సేకరించింది. కాపుల్లో ఎంతమంది ఉపాధి హామీ కూలి పనులకు వెళుతున్నారనే విషయంతోపాటు పలు అంశాలపై వివరాలు తీసుకుంది. కార్యక్రమంలో కమిషన్‌  సభ్యులు సత్యనారాయణ, ఎన్‌ .పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, పి.రమేష్‌కుమార్, ఎస్పీ భాస్కర్‌ భూషణ్, ఏజేసీ ఎంహెచ్‌ షరీఫ్, బీసీ వెల్ఫేర్‌ అధికారి జి.లక్ష్మిప్రసాద్, ఏబీసీడబ్ల్యూఓ ఏవీ ఎ.హరిబాబు పాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement