ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేశంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృత్యువాత పడ్డారు. 2008లో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటుచేసుకున్న ఈ తరహా విషాదాలు..
2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు.
2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు.
2015, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.
2014, అక్టోబర్ 3: బీహార్‌లోని పట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.
2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు.
2012, నవంబర్ 19: బీహార్‌లోని పట్నాలో గంగా నది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు.
2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున హర్కీ పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు.
2011, జనవరి 14 : కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటుచేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.
2010, మార్చి 4: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.
2008, సెప్టెంబరు 30 : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. 60 మందికి పైగా జనం గాయపడ్డారు.
2008, ఆగస్ట్ 3: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో కొండ చరియలు విరిగి పడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.
2005, జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.
2003, ఆగష్టు 27: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment