
తెలుగు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ నాశనం: జేపీ
తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ అన్నారు.
► ఎంసెట్ పేరుతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు
► ఏపీకి ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది
► వ్యవసాయంతో పరిశ్రమలను అనుసంధానం చేయాలి
► మార్కెటింగ్ వ్యవస్థ దళారులు చేతుల్లో మగ్గుతోంది
గుంటూరు ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ నాశనమైపోయిందని లోక్‌సత్తా పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎన్. జయప్రకాష్ నారాయణ అన్నారు. గుంటూరులో శనివారం జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంసెట్ పేరుతో తెలుగు విద్యార్థులు రెండేళ్లపాటు పడుతున్న శ్రమ బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. విద్యార్థుల చదువుల కోసం పేద తల్లిదండ్రులు అప్పులు చేస మరీ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది సమాజానికి చేటు చేస్తుందన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో అందిస్తున్న విద్య విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపయోగపడటం లేదన్నారు. విద్యార్థులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. దేశంలో నెలకు 10 లక్షల మంది డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని బయటకు వస్తున్నారని, ప్రపంచంలోనే ఇది అత్యధికమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి చూపడమనేది ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం అత్యాశే..
ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడటం అత్యాశే అవుతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. ప్రభుత్వం రంగంలో కేవలం రెండు శాతం ఉద్యోగాలు ఉండగా, మిగిలిన 98 శాతం ప్రైవేటు రంగంలోనే ఉంటాయన్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న విద్యా విధానంతో సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురాలేమని చెప్పారు. రాష్ట్ర విభజనతో ఏపీకి జరిగే నష్టాన్ని గురించి మొట్టమొదటిగా లెక్కలతో సహా బయటకు తెచ్చినది తానే అని, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమల స్థాపన జరిగి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం సులభతరమవుతుందని వివరించారు.
రాష్ట్రం మొత్తానికి కాకపోయినా కనీసం రాయలసీమ ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు అయినా ప్రత్యేక హోదా ద్వారా నిధులు, రాయితీలు కల్పిస్తే ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. హైదరాబాద్‌ను కోల్పోవడం ద్వారా నష్టపోయిన జాతీయ స్థాయి విద్య, వైద్య సంస్థలను ఏపీకి తరలించాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి బదులు రైతులకు తాయిలాలు ప్రకటించే విధానం ప్రస్తుతం నడుస్తోందన్నారు. వ్యవసాయంతో పరిశ్రమలను అనుసంధానం చేయడం ద్వారా ఇటు వ్యవసాయాన్ని, అటు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. ఏపీలో మార్కెటింగ్ వ్యవస్థ దళారుల చేతుల్లో మగ్గుతోందని, ఫలితంగా రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలువుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.