రేపు అన్నవరం రానున్న జయేంద్ర సరస్వతి | jayendra saraswathi | Sakshi
Sakshi News home page

రేపు అన్నవరం రానున్న జయేంద్ర సరస్వతి

Published Thu, Nov 17 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

jayendra saraswathi

 
  • కంచి కామకోటి పీఠాధిపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
  • 20న పంపా సత్రంలో శ్రీచంద్రమౌళీశ్వరస్వామి పూజ
అన్నవరం :
కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీజయేంద్ర సరస్వతి స్వామీజీ పర్యటనకు అన్నవరం దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.   నాలుగేళ్ల తరువాత స్వామీజీ ఈ నెల 19న సాయంత్రం అన్నవరం దేవస్థానానికి వస్తున్నారు. 20 వరకూ ఆయన అన్నవరంలోనే బస చేస్తారని ఈఓ నాగేశ్వరరావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఏ అవాంతరాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ దేవస్థానంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగంలో కూడా ఆయన పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు  దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా 19న వస్తారన్నారు. స్వామీజీ పర్యటన గురించి అన్నవరం, చుట్టుపక్కల గ్రామాలలో ప్రచారం చేయిస్తున్నామని తెలిపారు.
ఇదీ పర్యటన షెడ్యూల్‌
కంచి కామకోటి  పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తో కలిసి రానున్న శ్రీజయేంద్ర సరస్వతి  స్వామీజీకి 19న సాయంత్రం ఘాట్‌రోడ్‌ ముఖద్వారంలో ఘనస్వాగతం పలుకుతారు.  అనంతరం స్వామీజీ సత్యదేవుని ఆలయానికి చేరుకుంటారు. స్వామివారిని దర్శించి పూజలు చేశ  సత్యగిరి అతిథిగృహంలో బస చేస్తారు. 20న ఉదయం 9 నుంచి మ«ధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొండదిగువన  పంపా సత్రంలో శ్రీ మహా త్రిపురసుందరి సమేత శ్రీచంద్రమౌళీశ్వరస్వామి పూజ నిర్వహిస్తారు. పంపా సత్రంలో నిర్వహించే శ్రీచంద్రమౌళీశ్వరస్వామి పూజకు తటాకం లేదా ప్రవహించే కాల్వ లేదా భూమిలో నుంచి మోటార్‌ ద్వారా వచ్చే వంద బిందెల పరిశుద్ధ జలం అవసరం. పీఠాధిపతి బస చేసే పంపా సత్రం పక్కనే పంపా కాల్వ ప్రవహిస్తోంది. సత్రం ఈశాన్యభాగంలో బోర్‌ కూడా ఉంది. దీంతో పంపా సత్రంలో పూజ నిర్వహించాలన్న ఆయన అభిమతం మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్‌రోడ్‌ ముఖద్వారం, తొలిపావంచా, పంపా సత్రం వద్ద జయేంద్ర సరస్వతి చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు 
చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement