‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
‘‘దేవస్థానానికి అప్రతిష్ట తీసుకురాకండి’’
Published Thu, Jun 8 2017 11:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM
ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ ఆగ్రహం
వేద పాఠశాల నిర్మాణ పనుల జాప్యంపై అసంతృప్తి
సహజ ఆసుపత్రి నిర్వహణపైనా అదే రీతిలో స్పందన
పారిశుద్ధ్యం బాగోలేదని కాంట్రాక్టర్‌కు రూ.పదివేలు జరిమానా
యాగశాల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
అన్నదానం భవనం నిర్మాణస్థలం మార్పుపై పరిశీలన
అన్నవరం(ప్రత్తిపాడు) : అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరుపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణాలు నత్తనడకన సాగడం, సహజ ఆసుపత్రి పరిసరాల్లో అపరిశుభ్రత తాండవించడంపై ‘ఇది దేవస్థానానికి అప్రతిష్ట’ అని వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆయన అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. వివిధ నిర్మాణపథకాల పనితీరును పరిశీలించారు. సత్యగిరిపై రూ.2.82 కోట్ల వ్యయంతో చేపట్టిన స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులు నత్తనడకన సాగుతుండడంపై జేఎస్‌వీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం నిర్వహణ, సహజ ఆసుపత్రి పనితీరుపైనా తీవ్ర అసంతృపి వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులను నిలదీశారు.
డిసెంబర్ నాటికి పూర్తి కావాలి..
సత్యగిరిపై నిర్మిస్తున్న స్మార్త, ఆగమ, వేదపాఠశాల పనులను ఆయన పరిశీలించారు. పనుల జాప్యంపై ఆరాతీశారు. ఈ నిర్మాణాలు చేసే నిపుణులైన పనివారి కొరత ఉండడంతో ఆలస్యమవుతోందని కాంట్రాక్టర్ నాయుడు తెలిపారు. అవసరమైనంత మందిని తీసుకువచ్చి ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యేలోపు వేదపాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటాలని, స్థలం చుట్టూ పాతపద్ధతిలో మెస్‌తో ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు.
సహజ ఆసుపత్రి పనితీరుపై అసంతృప్తి..
దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి ఆసుపత్రి పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పది మంది సిబ్బంది, నలుగురు పేషెంట్లు ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం ఉండడాన్ని చూసి మండిపడ్డారు. ఇది ఆలయానికి అప్రతిష్ట అని ఈఓను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవస్థానంలో పారిశుద్ధ్య పనులు చూస్తున్న పద్మావతి సంస్థ అన్నవరం మేనేజర్ కుళాయప్పకు రూ.పదివేలు జురిమానా విధించారు.
ఆర్‌జేసీ అజాద్‌కు ‘సహజ’ బాధ్యతలు..
సహజ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ ఆయుష్ సంస్థకు అనుసంధానం చేసి అభివృద్ధి చేస్తామని ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ అన్నారు. ఇందుకుగాను 20 పాయింట్లు రూపొందించామన్నారు. ఆసుపత్రి ముందు ఔషద మొక్కలను పెంచుతామన్నారు. ఆ పనులను దేవాదాయశాఖ కాకినాడ ఆర్‌జేసీ చంద్రశేఖర్ అజాద్‌కు అప్పగిస్తున్నట్టు తెలిపారు. పనులు పూర్తయ్యాక దీనిపై ఒక బ్రోచర్ ముద్రించి ప్రచారం చేస్తామన్నారు.
చెందుర్తిలో సోలార్ పవర్‌ప్రాజెక్ట్
చెందుర్తిలో ఉన్న 135 ఎకరాల దేవస్థానం స్థలంలో 1.5 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రూ.4.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రసాద్ సూచించారు. ఈ ప్రాజెక్ట్ ను సత్యగిరిపై ఏర్పాటు చేయాలని గతంలోనే దేవస్థానం చైర్మన్, ఈఓ లతో కూడిన పాలకమండలి తీర్మానించింది. అయితే సత్యగిరిపై కాకుండా చెందుర్తి భూమిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఎట్టకేలకు యాగశాల నిర్మాణానికి మోక్షం:
దేవస్థానంలో యాగశాల ఏర్పాటు పనులు 18 నెలలుగా నిలిచిపోయిన విషయం విదితమే. అయితే గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ ఈ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తన ఆదేశాలను దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియజేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఈఓను ఆదేశించారు.
అన్నదానం భవన నిర్మాణస్థలం మార్పుపైనా సానుకూలత..
అన్నదాన భవన నిర్మాణాన్ని పాత టీటీడీ సత్రం భవనస్థలంలో నిర్మించే విషయమై పరిశీలనకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్, ఈఓలతో కలసి ఆయన టీటీడీ సత్రం స్థలాన్ని పరిశీలించారు.
సత్యగిరిపై నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదు
సత్యగిరిపై 138 గదుల సత్రంతో సహ ఈ విధమైన నిర్మాణాలను అంగీకరించే ప్రసక్తి లేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు. అయితే సౌండ్ అంట్ లైట్ షో, అర్బన్ గ్రీనరీ పనులు కొనసాగుతాయని వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ వెంట దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, దేవాదాయశాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ అజాద్, దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు, డీఈలు రామకృష్ణ, రాజు, ఏఈలు రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement