'కేసీఆర్.. నువ్వూ తెలంగాణ ద్రోహివే'
⇒ తెలంగాణలో టీడీపీ బీటీం పాలన: జీవన్‌రెడ్డి
జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బీ-టీమ్ పాలన కొనసాగుతోందని సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపితే.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టిందని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు కూలీల గర్జనలో ఆయన మాట్లాడారు. ‘ కేసీఆర్.. నువ్వు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరించినవ్. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం అదే పార్టీలో పదవులు అనుభవించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ద్రోహులతో జతకట్టావు. ఈ రోజు నీకు వాళ్లందరూ చుట్టాలయ్యారా? వారితో కలగలసిన నువ్వూ.. తెలంగాణ ద్రోహివే’ అని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
మద్యం డబ్బు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రగతి సాధించిందన్నారు. పదేళ్లలో మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ. 10 వేల కోట్లు అంచనా ఉంటే.. రెండేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం రూ. 12 వేల కోట్ల ఆర్థిక ఆదాయం ఆర్జించిందన్నారు. బెల్ట్ షాపు లేని గ్రామం.. ప్రస్తుతం రాష్ట్రంలోనే లేదన్నారు. ‘ కేసీఆర్ నువ్వు తాగు.. కానీ నీ అలవాటును వేరే వాళ్లకి ఎందుకు అంటగడుతున్నవ్..? రాష్ట్రాన్ని ఎందుకు తాగిస్తున్నవ్...? అసలు తెలంగాణను ఏం చేయదలుచుకున్నవ్..? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులు తీసుకున్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని, వరిధాన్యం, మొక్కజొన్న పంటలకు క్వింటాలుకు రూ. 200, పత్తి, సోయా పంటలపై క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సారంగాపూర్ తహసీల్దార్‌కు అందజేశారు.
గర్జన సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ప్రసంగాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలు.. ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రార్ధించారు.