t jeevanreddy
-
పట్టభద్రులు ఎటువైపు..?
సాక్షి, జగిత్యాల: పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 22న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో ఎన్నికలకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం పట్టభద్రులైన ఓటర్లు 16,098 మంది ఉండగా వారిలో 11,178 మంది పురుషులు, 4920 మంది మహిళా ఓటర్లున్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు జిల్లాలో 1329 మంది ఉండగా వారిలో పురుషులు 993 మంది కాగా 336 మంది మహిళలు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల అసలైన పోరు నడుస్తోంది. జిల్లాలోని పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపనున్నారోననేది ఆసక్తి నెలకొంది. ప్రచార హోరు.. జిల్లాలో యువతే లక్ష్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రచార పర్వం సాగిస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజా మాబాద్, మెదక్ జిల్లాల పరిధి పట్టభద్రుల నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో తనదైన శైలిలోప్రచారం సాగిస్తున్నారు. ఆయా జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను కలుపుకొని ప్రచార పర్వాన్ని కొనసా గిస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు తమతమ సంఘాల నెట్‌వర్క్‌తో బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువతకు గాలం.. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రధానంగా యువతను లక్ష్యం చేసుకుని ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్లు దాటిన పట్టభద్రులు ఈసారి పెద్ద ఎత్తున ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సుమారు 80వేల వరకు పట్టభద్రులుండగా వారిలో జిల్లానుంచి 16వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో నిరుద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు జిల్లాలో నియోజకవర్గాల స్థాయిల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. యువతను లక్ష్యం చేసుకుని, పార్టీ శ్రేణుల సమీకరణతో జిల్లాకేంద్రంతో పాటు నియోజకవర్గాల స్థాయిలో మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నించే గొంతుకనవుతానంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు యువతపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ పార్టీ బలాన్ని నమ్ముకుని విస్త్రృతంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారోననే సర్వత్రా చర్చ సాగుతోంది. -
ఉద్యమ ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఉంటుందని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2014లో ఉద్యమ పార్టీగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతుందని టీఆర్ఎస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తే పూర్తి మెజార్టీ ఉండి కూడా నాలుగున్నరేళ్లకే కాడెత్తేసిందని ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ముం దస్తు ఎన్నికలను తెరపైకి తెచ్చారన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, హామీలు ఒక్కటీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. మిషన్ భగీరథ పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ప్రజ లపై అప్పుల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కమీషన్ల కోసమే చేపట్టిన మిషన్ భగీరథ వల్ల రోడ్లన్నీ గుంతలమయం చేశారని ధ్వజమెత్తారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వనిదే ఓట్లు అడగబోనన్న కేసీఆర్.. ఇప్పుడు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఆకాంక్షల కోసమే ప్రజాస్వామ్యబద్ధంగా కలిసి వచ్చే పక్షాలతో తాము ఎన్నికల కూటమి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
రాయికల్ ఆస్పత్రికి రాజకీయ గ్రహణం
రాయికల్(జగిత్యాల) : రాయికల్‌లోని 30 పడకల ఆస్పత్రికి రాజకీయ గ్రహణం పట్టింది. రాజకీయ జోక్యంతో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. విధులు నిర్వర్తించేందుకు వెనుకాడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ప్రజాప్రతినిధులు ఆధిపత్య పోరులో డాక్టర్లు బలవుతున్నారు. రాయికల్ మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని 2009లో అప్‌గ్రేడ్ చేశారు. మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల మండలాల నుంచి రాయికల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో 823 ప్రసవాలు జరుగగా రికార్డుస్థాయిలో జనవరి నెలలోనే 130 ప్రసవాలు జరిగాయి. ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ స్త్రీ,వైద్యనిపుణురాలు చైతన్య, దంత వైద్య నిపుణురాలు ప్రవీణ్‌చంద్ర, సిబ్బంది సహకారంతో రాయికల్ ఆస్పత్రి ప్రసవాలలో జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిపారు. ఆధిపత్యపోరు.. ఆస్పత్రి వ్యవహారాల్లో కొన్ని రోజులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ అతిగా జోక్యం చేసుకుంటున్నారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 30 పడకల ఆస్పత్రికి ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీవో రాయికల్‌లో అమలుకావడంలేదు. ఎంపీపీ ఆస్పత్రి చైర్మన్ అంటూ టీఆర్ఎస్ వర్గాలు ఆస్పత్రి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. ఇదే వ్యవహారంలో తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చైర్మన్ అంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీ గోపి మాధవి, ఎంపీటీసీలు కట్కం సులోచన, ఎద్దండి సింధుజ, తలారి నాగమణి జోక్యం చేసుకుంటూ ఒకరిపై ఒకరు అభివృద్ధి పనుల్లో , సమావేశాల్లో ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం 102 వాహన ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, సమావేశంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ నూతన జీవో ప్రకారం ఆస్పత్రి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అని ప్రస్తావించారు, సంజయ్‌కుమార్ జోక్యం చేసుకుని జీవో చూపించాలని, అప్పటి వరకు ఎంపీపీ చైర్మన్ అంటూ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌పై సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపం చెందిన వైద్యాధికారి శ్రీనివాస్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. కలెక్టర్‌ను కలవనున్న వైద్యులు.. రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు మెడికల్ పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చైతన్యసుధ, దంతవైద్య నిపుణుడు ప్రవీణ్‌చంద్ర విధులు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ క్షయ, టీబీ జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డాక్టర్ వెంకన్న, అవంతి వెళ్లడంతో కేవలం రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ముగ్గురు వైద్యులే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో తమతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడం కష్టతరంగా ఉందని, ఈ విషయంపై కలెక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా డీఎంహెచ్‌వో సుగంధిని యుద్ధప్రతిపాదికన స్పందించి రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రి చైర్మన్ ఎవరు, ఆస్పత్రికి పట్టిన రాజకీయ గ్రహణాన్ని విడిపించేలా చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. -
'కేసీఆర్.. నువ్వూ తెలంగాణ ద్రోహివే'
⇒ తెలంగాణలో టీడీపీ బీటీం పాలన: జీవన్‌రెడ్డి జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బీ-టీమ్ పాలన కొనసాగుతోందని సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి విమర్శించారు. నాడు కాంగ్రెస్ పార్టీ పలు సంక్షేమ పథకాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నెట్టిందని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు కూలీల గర్జనలో ఆయన మాట్లాడారు. ‘ కేసీఆర్.. నువ్వు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరించినవ్. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం అదే పార్టీలో పదవులు అనుభవించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ద్రోహులతో జతకట్టావు. ఈ రోజు నీకు వాళ్లందరూ చుట్టాలయ్యారా? వారితో కలగలసిన నువ్వూ.. తెలంగాణ ద్రోహివే’ అని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మద్యం డబ్బు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రగతి సాధించిందన్నారు. పదేళ్లలో మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ. 10 వేల కోట్లు అంచనా ఉంటే.. రెండేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం రూ. 12 వేల కోట్ల ఆర్థిక ఆదాయం ఆర్జించిందన్నారు. బెల్ట్ షాపు లేని గ్రామం.. ప్రస్తుతం రాష్ట్రంలోనే లేదన్నారు. ‘ కేసీఆర్ నువ్వు తాగు.. కానీ నీ అలవాటును వేరే వాళ్లకి ఎందుకు అంటగడుతున్నవ్..? రాష్ట్రాన్ని ఎందుకు తాగిస్తున్నవ్...? అసలు తెలంగాణను ఏం చేయదలుచుకున్నవ్..? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రైతులు తీసుకున్న రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని, వరిధాన్యం, మొక్కజొన్న పంటలకు క్వింటాలుకు రూ. 200, పత్తి, సోయా పంటలపై క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సారంగాపూర్ తహసీల్దార్‌కు అందజేశారు. గర్జన సభలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ప్రసంగాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి రాష్ట్రానికి అందించిన సేవలు.. ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రార్ధించారు. -
'ప్రకటనల కోసమేనా తెలంగాణ ఏర్పాటు?'
హైదరాబాద్ : హామీలు, ప్రకటనలకు పరిమితం అయ్యేందుకేనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదని కాంగ్రెస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 15 నెలలు రైతు సంక్షేమం గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచించనేలేదని ఆయన విమర్శించారు. చైనాకు వెళ్లి పరిశ్రమలు తెస్తే మంచిదే, కానీ అందులో పది శాతమైనా రైతుల గురించి ఆలోచిస్తే బాగుండేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక కేసీఆర్‌కు లేదా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం లాగే టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ఆయన మండిపడ్డారు.