రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రి
రాయికల్(జగిత్యాల) : రాయికల్‌లోని 30 పడకల ఆస్పత్రికి రాజకీయ గ్రహణం పట్టింది. రాజకీయ జోక్యంతో వైద్యులు ఇబ్బంది పడుతున్నారు. విధులు నిర్వర్తించేందుకు వెనుకాడుతున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ప్రజాప్రతినిధులు ఆధిపత్య పోరులో డాక్టర్లు బలవుతున్నారు. రాయికల్ మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని 2009లో అప్‌గ్రేడ్ చేశారు. మల్లాపూర్, మేడిపల్లి, జగిత్యాల మండలాల నుంచి రాయికల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ప్రభుత్వ ఆస్పత్రిలో 823 ప్రసవాలు జరుగగా రికార్డుస్థాయిలో జనవరి నెలలోనే 130 ప్రసవాలు జరిగాయి. ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ స్త్రీ,వైద్యనిపుణురాలు చైతన్య, దంత వైద్య నిపుణురాలు ప్రవీణ్‌చంద్ర, సిబ్బంది సహకారంతో రాయికల్ ఆస్పత్రి ప్రసవాలలో జిల్లాలోనే మొదటిస్థానంలో నిలిపారు.
ఆధిపత్యపోరు..
ఆస్పత్రి వ్యవహారాల్లో కొన్ని రోజులుగా ఎంపీపీ, జెడ్పీటీసీ అతిగా జోక్యం చేసుకుంటున్నారు. దీంతో డాక్టర్లు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 30 పడకల ఆస్పత్రికి ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉండాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీవో రాయికల్‌లో అమలుకావడంలేదు. ఎంపీపీ ఆస్పత్రి చైర్మన్ అంటూ టీఆర్‌ఎస్ వర్గాలు ఆస్పత్రి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. ఇదే వ్యవహారంలో తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చైర్మన్ అంటూ కాంగ్రెస్ జెడ్పీటీసీ గోపి మాధవి, ఎంపీటీసీలు కట్కం సులోచన, ఎద్దండి సింధుజ, తలారి నాగమణి జోక్యం చేసుకుంటూ ఒకరిపై ఒకరు అభివృద్ధి పనుల్లో , సమావేశాల్లో ఆరోపణలు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం 102 వాహన ప్రారంభోత్సవానికి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా, సమావేశంలో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ నూతన జీవో ప్రకారం ఆస్పత్రి చైర్మన్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అని ప్రస్తావించారు, సంజయ్‌కుమార్ జోక్యం చేసుకుని జీవో చూపించాలని, అప్పటి వరకు ఎంపీపీ చైర్మన్ అంటూ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్‌పై సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపం చెందిన వైద్యాధికారి శ్రీనివాస్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు.
కలెక్టర్‌ను కలవనున్న వైద్యులు..
రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు మెడికల్ పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ చైతన్యసుధ, దంతవైద్య నిపుణుడు ప్రవీణ్‌చంద్ర విధులు నిర్వర్తిస్తున్నారు. డాక్టర్ శ్రీనివాస్ క్షయ, టీబీ జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డాక్టర్ వెంకన్న, అవంతి వెళ్లడంతో కేవలం రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ముగ్గురు వైద్యులే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో తమతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడం కష్టతరంగా ఉందని, ఈ విషయంపై కలెక్టర్ శరత్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా డీఎంహెచ్‌వో సుగంధిని యుద్ధప్రతిపాదికన స్పందించి రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రి చైర్మన్ ఎవరు, ఆస్పత్రికి పట్టిన రాజకీయ గ్రహణాన్ని విడిపించేలా చర్యలు చేపట్టాలని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆస్పత్రి సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment