జోగిపేట కమిషనర్ సస్పెన్షన్
హరితహారంపై నిర్లక్ష్యం
టెండర్ల అవకతవకలు కూడా కారణమే!
ఉత్తర్వులు జారీ చేసిన డీఆర్‌ఓ
తీసుకోవడానికి నిరాకరించిన కమిషనర్
జోగిపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జోగిపేట నగర పంచాయతీ కమిషనర్‌పై మంగళవారం సస్పెన్షన్ వేటు పడింది. నగర పంచాయతీలో టెండర్ల ఖరారులోనూ అవకతవకలకు పాల్పడడం కూడా ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. ఈనెల 8న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హరితహారాన్ని ప్రారంభించిన విషయం తెల్సిందే. జోగిపేట నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఒక్క మొక్క కూడా నాటకపోగా 300 మొక్కలు నాటినట్టు జోగిపేట నగర పంచాయతీ కమిషనర్ సీవీ రవీందర్‌రావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీడీఓ ద్వారా తప్పుడు సమాచారమిచ్చారు. ఈ ఇదే విషయమై నియోజకవర్గ ప్రత్యేక అధికారి యాష్మిన్‌బాషా సోమవారం నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. ఒక మొక్క కూడా నాటకపోగా ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదనే విషయం వెలుగు చూసింది. ఈ విషయమై ఆమె కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్‌ఓ దయానంద్ మంగళవారం కమిషనర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
టెండర్లలో అవకతవకలు కూడా కారణమే?
నగర పంచాయతీకి మంజూరైన 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ.29.82 లక్షలతో 15 పనులకు ఈ ప్రొక్యూర్‌మెంట్ కింద టెండర్లను పిలిచారు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5 నుంచి 27వ తేదీ ఉదయం 10 వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో ఉంచి తొలగించారు. దీంతో టెండర్ల దాఖలుకు ఎవరికి కూడా అవకాశం దక్కలేదని, ఈ విషయంలో కుట్రపూరితంగా వ్యవహరించారని కౌన్సిలర్లు స్థానిక ఎమ్మెల్యే పి.బాబూమోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని అప్పట్లోనే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఏజేసీ వెంకటేశ్వరరావు, సంగారెడ్డి మున్సిపాలిటీ డిప్యూటీ ఈఈలకు విచారణ బాధ్యతలు అప్పగింఆచరు. మార్చి 17న ఏజేసీ నేతృత్వంలోని అధికారుల బృందం జోగిపేట నగర పంచాయతీకి వచ్చి విచారణ జరిపింది. ఆర్థిక సంఘ నిధులకు సంబంధించిన టెండర్లలో గోల్‌మాల్ జరిగినట్లు విచారణలో తేలడంతో కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా కూడా కమిషనర్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉత్తర్వులు స్వీకరించని కమిషనర్
కలెక్టర్ ఆదేశానుసారం డీఆర్‌ఓ మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ సూచన మేరకు ఆర్‌ఐ నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఉత్తర్వు ప్రతిని కమిషనర్‌కు ఇచ్చేందుకు ప్రయత్నించగా అందుకు ఆయన నిరాకరించినట్టు తెలిసింది. ఉత్తర్వులు వచ్చినట్టు తెలుసుకున్న కమిషనర్ వెంటనే కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. హౌసింగ్‌బోర్డులో ఆయన నివాసం ఉంటున్న ఇంటికి ఉత్తర్వు ప్రతిని అతికించారు. చుట్టుపక్కల వారిచే సాక్షి సంతకాలు తీసుకున్నట్టు తహసీల్దార్ తెలిపారు.