♦ ఐదుగురు నోడల్ అధికారుల సస్పెన్షన్
♦ మరో ఐదుగురికి షోకాజ్ నోటీసులు
♦ కలెక్టర్‌తోపాటు అధికారుల సుడిగాలి పర్యటన
♦ హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలి
♦ కలెక్టర్ యోగితారాణా అధికారుల్లో ఆందోళన
రెంజల్ : హరితహారంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు పడింది. బుధవారం కలెక్టర్ యోగితారాణాతోపాటు జిల్లాస్థారుు అధికారులు క్షేత్రస్థారుులో పరిశీలించారు. స్వయంగా లోపాలను పరిశీలించిన కలెక్టర్ యోగితారాణా హరితహారం గ్రామనోడల్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరి కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బుదవారం ఉదయం కలెక్టర్ యోగితారాణా రెంజల్ మండలం సుడిగాలి పర్యటన నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరును పరిశీలించారు. విధులపై నిర్లక్ష్యం వహించిన ఐదుగురు హరితహారం నోడల్ అధికారులను సస్పెండ్ చేశారు. మరో ఐదుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హరితహారం నోడల్ అధికారులు తమ గ్రామాల్లో మంగళవారం రాత్రి బస చేయాల్సి ఉండగా ఏ ఒక్కరు ఆదేశాలు పాటించకపోవడంతోపాటు బుధవారం తమ గ్రామాల్లో మొక్కల నాటే కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం పథకాన్ని అమలు చేస్తుండగా క్షేత్రస్థాయిలో షెడ్యుల్ ప్రకారం సెక్టార్ అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయకపోవడంతో ఈ చర్యకు ఉపక్రమించారు. మండలంలో సెక్టార్ అధికారులుగా పనిచేస్తున్న ట్రాన్స్‌కో ఏఈ బాల్‌చందర్, ఆర్‌అండ్‌బీ ఏఈ దనేష్, పీఆర్ ఏఈ నిఖిత, ఇరిగేషన్ ఏఈ నగేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అభిలాష్‌లను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అలాగే ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో సంజీవ్‌రెడ్డి, వ్యవసాయాధికారి సిద్ధి రామేశ్వర్, సాక్షరభారత్ మండల సమన్వయకర్త వినోద్, ఈవోపీఆర్డీలకు షోకాజ్ నోటీసులు కలెక్టర్ జారీ చేశారు. మండలంలో హరితహారంపై ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా దృష్టిసారించని మండల ప్రత్యేకాధికారి కీర్తికాంత్‌ను మందలించారు. నీ పరిధిలోని అధికారులు ఇప్పటి వరకు 2,3 వేల మొక్కలు నాటించలేదని నిలదీశారు.
ఎంసీడీవోకు షోకాజ్ నోటీస్‌తో సరి : ఎంపీడీవో చంద్రశేఖర్‌పై కలెక్టర్ సీరియస్‌గా వ్యవహరించారు. తీవ్రస్థాయిలో మందలించడంతో ఆయన ఖంగుతున్నారు. ఇలాగే వ్యవహరిస్తే వేటు తప్పదని హెచ్చరించారు.
అలక్ష్యం వద్దు..
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని కలెక్టర్ యోగితారాణా అన్నారు. బుధవారం రెంజల్ మండలం నీలా, బాగేపల్లి, కూనేపల్లి, వీరన్నగుట్ట, రెంజల్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా గ్రామాల్లోని తెలంగాణ హరితహారం నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 3.35 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామానికి 40 వేల మొక్కలు నాటాలని నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి 11 మొక్కలు నాటాలన్నారు. రైతులకు రూపాయి భారం లేకుండా అడిగిన మొక్కలను పొలం వద్దకు నేరుగా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆవరణలు, పంట పొలాలు, స్మశాన వాటికలు, ఇతర ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని అన్నారు. రైతులు కోరిన మొక్కలను ఉచితంగా అందిస్తామన్నారు. 2,3 రోజుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం పూర్తయ్యే వరకు అధికారులు ఇతర పనులకు ప్రాధాన్యం ఇవ్వ వద్దన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు కమిటీలను నియమించినట్లు తెలిపారు.
మొక్కలు నాటిన కలెక్టర్
మండలంలోని బాగేపల్లి గ్రామంలో కలెక్టర్ యోగితారాణా మొక్కలు నాటారు. గ్రామస్తులు బాధ్యతగా గుర్తించాలన్నారు. వర్షాలు సమృద్ధిగా పడి రైతులు కరువును జయించేందుకు మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. మొక్కలను సంరక్షించినందుకు అవరమైన నగదును అందించడం జరుగుతుందన్నారు. హరితహారంతో కరువును జయించడంతోపాటు ఉపాధి కూ లీల వలసలను నివారించవచ్చన్నారు. అనంతరం గ్రా మస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. మొక్కల పెంపకానికి ముందుకు వచ్చే ఏ ఒక్కరిపైనా భారం పడకుండా చూస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటయ్య, ఎంపీడీవో చంద్రశేఖర్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై ప్రసాద్‌లు ఉన్నారు.