షరతులు వర్తిస్తాయ్
కోడి పందేలపై హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం కోర్టు
కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశాలు
కోర్టు ఆదేశాలు అమలు చేస్తాం : ఎస్పీ భాస్కర్ భూషణ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశించింది. ఇలాంటి మినహాయింపులను అడ్డం పెట్టుకుని సంక్రాంతి రోజుల్లో పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేల సందర్భంగా కోళ్లకు కట్టే కత్తులను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పిన సుప్రీం కోర్టు పందెం కోళ్లను మాత్రం స్వాధీనం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసులు దీని కోసం ఎక్కడబడితే అక్కడ దాడులు చేయకూడదని, ఈ పందేలకు గుర్తింపు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తనిఖీలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జిల్లాకు చెందిన నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు పైవిధంగా ఉత్తర్వులిస్తూ.. కేసు విచారణను నెల రోజులపాటు వాయిదా వేసింది.
ఆచితూచి అడుగులు
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించే వారితోపాటు కోళ్లకు కత్తులు కట్టేవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతూ వచ్చారు. గతంలో పందేలపై దాడులు చేసినపుడు కోళ్లను కూడా స్వాధీనం చేసుకునేవారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ’సాక్షి’కి తెలిపారు. మరోవైపు కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా సంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలకు అనుమతి ఇవ్వకపోయినా, కోర్టులు అక్షింతలు వేసినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆఖరి నిముషంలో ఇచ్చే ఆదేశాలతో జిల్లాలో ఏటా కోడిపందేలు నిరాంటంకంగా సాగిపోతున్నాయి. బరుల వద్దే గుండాట, పేకాట, కోతాట వంటి జూదాలకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల ఏర్పాటు అధికార పార్టీ నేతలే చేస్తుండటంతో సంక్రాంతి మూడు రోజులైనా అనుమతి వస్తుందన్న ఆశతో పందేల రాయుళ్లు ఉన్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు కోడిపందేలపై దాడుల కోసం జాయింట్ యాక‌్షన్ టీమ్‌ల ఏర్పాటుకు శనివారం చివరి రోజు కావడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.