రాజమండ్రి : రాజమండ్రి నగరంలో వైఎస్ఆర్ సీపీ నేతల అరెస్ట్పై ఆ పార్టీ శాసనసభ ఉప నేత జ్యోతుల నెహ్రు మండిపడ్డారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో జ్యోతుల నెహ్రు మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సీపీ నేతల చేపట్టిన బంద్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ అరెస్టులపై న్యాయ విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతం అయిందనే దురుద్దేశంతో సర్కార్ అణిచివేత ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందిం పెడితే ఊరుకోమని జ్యోతుల నెహ్రు స్పష్టం చేశారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు ప్రధాని మోదీని కలసి విజ్ఞప్తి చేశారు. అయినా కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 29వ తేదీన బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో బంద్ నిర్వహిస్తున్న ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతుల నెహ్రుపై విధంగా స్పందించారు.