జలకళ తీసుకొద్దాం!
♦ 160 టీఎంసీల ప్రాణహిత నీటిని మళ్లించేందుకు 16 రిజర్వాయర్లు
♦ గతంలో ఉన్నవి 10 రిజర్వాయర్లు, 16 టీఎంసీల సామర్థ్యం ఉన్నవే
♦ {పస్తుత రిజర్వాయర్లతో 125 టీఎంసీల మేర నిల్వ
♦ కొత్తగా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఎల్లారెడ్డిలలో 7 రిజర్వాయర్లు
♦ కొత్త ప్రణాళికకు సీఎం సూత్రప్రాయ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు, రాజధాని తాగు అవసరాలకు ఉద్దేశించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేటాయించిన నీటినంతా ఒకేమారు ఒడిసిపట్టేలా బృహత్ ప్రణాళిక సిద్ధమైంది. వాస్తవ సమగ్ర నివేదిక(డీపీఆర్)ల్లో ఉన్న పలు రిజర్వాయర్ల తొలగింపు, కొత్తగా పలుచోట్ల నిర్మాణం చేసేలా తుది ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాణహితపై ప్రతిపాదిత మేడిగడ్డ నుంచి 160 టీఎంసీల మళ్లింపు, ఇందులో ఒకేమారు 125 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉండేలా రిజర్వాయర్ల నిర్మాణ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ సూత్రప్రాయ ఆమోదం తెలిపారు.
కొత్త రిజ ర్వాయర్లలో ఏకంగా 20 టీఎంసీల మేర సామర్థ్యం కలిగిన 7 రిజర్వాయర్లను నిజామాబాద్ జిల్లాలోనే నిర్మించేలా కొత్త డిజైన్ సిద్ధం చేశా రు. అప్పటి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డికి ప్రాణహిత నీటిని మళ్లించే క్రమం లో మొత్తంగా 10 రిజర్వాయర్లను ప్రతి పాదించింది. ఇందులో తుమ్మిడిహెట్టి బ్యారేజీతో పాటు మేడారం, మలక్‌పేట్, అనంతగిరి, ఇమాంబాద్, తడ్కపల్లి, పాములపర్తి, బస్వాపూర్, తిప్పారం, చేవెళ్ల రిజర్వాయర్లను మొత్తంగా 16 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో చేపట్టాలని భావించారు. మళ్లింపు నీటిని నిల్వ చేసేందుకు ఇవేం సరిపోవన్న ఉద్దేశంతో సిద్ధిపేటలోని తడ్కపల్లి రిజర్వాయర్‌ను 1.5 టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గంలోని పాములపర్తిని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ తర్వాత నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్ రిజర్వాయర్‌ను సైతం ఒక టీఎంసీ నుంచి 11 టీఎంసీలకు పెంచాలని, కొత్తగా గంధమలలో 10 టీఎం సీల రిజర్వాయర్‌ను చేపట్టాలని మరో నిర్ణ యం తీసుకుంది. ఈ తరుణంలోనే పాములపర్తి నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు నీటిని మళ్లించే ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నీటి తరలింపునకు కామారెడ్డి నియోజకవర్గంలో 4, ఎల్లారెడ్డిలో 3 రిజర్వాయర్లను కొత్తగా ప్రతిపాదించారు. కామారెడ్డిలో తలమడ్ల, తిమ్మక్కపల్లి, ఖాజాపూర్, ఇసాయిపేట్, ఎల్లారెడ్డిలో మోతె, గుజ్జాల్, కోటెవాడి చెరువులను రిజర్వాయర్లుగా మార్చాలని నిర్ణయించినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వీటి సామర్థ్యం 18-20 టీఎంసీలు ఉంటుందంటున్నాయి. దీంతో ప్రాజెక్టు రిజర్వాయర్లలో నిల్వ సామర్థ్యం 16 నుంచి 125 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి.
తిప్పారం, చేవెళ్ల రద్దు: ఇక పాములపర్తి నుంచి శామీర్‌పేట చెరువు మీదుగా చేవెళ్లకు నీటిని మళ్లించే విషయమై ఆదివారం అర్ధరాత్రి వరకు వ్యాప్కోస్ ప్రతి నిధులు, ప్రాజెక్టు అధికారులతో జరిపిన సమావేశంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మెదక్ జిల్లాలోని తిప్పారం రిజర్వాయర్‌తో పాటు చేవెళ్ల వద్ద 3 టీఎంసీల రిజర్వాయర్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రాణహిత నుంచి నీటిని చేవెళ్లకు తీసుకురావడం కష్టమని సీఎం ప్రకటించినా, రంగారెడ్డి జిల్లాకు చెందిన విపక్ష నాయకులు ఆందోళన చేస్తుండటంతో చేవెళ్లకు నీటి అంశంపై నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. లైడార్ సర్వే పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామని మంత్రులు చెబుతున్నా.. ఆదివారం సమావేశంలో ఈ అంశాన్ని మర్చిపోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం.