వలస జిల్లా పేరు చెరిపేస్తాం
బాలానగర్ : పాలమూరుకు ఉన్న వలసల జిల్లా పేరును చెరిపేసి, జిల్లాకే వలసలు వచ్చేవిధంగా మఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం బాలానగర్ మండల పరిధిలోని రాజాపూర్‌లో ప్రభుత్వ పశువైద్యశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం రాజాపూర్‌లోని మల్లేపల్లి చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకు చెందినవారు ఉన్నారని, వారికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇవ్వని హామీలను అమలులోకి తెస్తున్నారని అన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేసి సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఇప్పటికీ ఆంధ్రాపాలకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు నోటుకేసులో చంద్రబాబు తప్పించుకునేందుకు మరో అంశాన్ని ముం దుకు తెచ్చి రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. తన స్వార్థంకోసం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి విషయానికి వస్తే రాష్ట్రంలో 50ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ దళితుల భూపంపిణీ కోసం ప్రభుత్వం రూ.700కోట్లు కేటాయించిందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఇచ్చే రుణాలు యూనిట్ విలువ రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివశంకర్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ భాగ్యమ్మ, వైస్ ఎంపీపీ లింగ్యానాయక్, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీలు బుచ్చమ్మ, శమంత, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి పది మొక్కలు నాటాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఇంటికి పది మొ క్కలు నాటాలని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం హరితహారం ప్రచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హరితహారంపై ప్రతి గ్రామంలో ప్రజలకు విస్తృతం గా అవగాహన కల్పించాలని సూచించారు. చె ట్లు ఉంటేనే వర్షాలు బాగా పడతాయని, దీని పై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.