మహిళాభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు కందుకూరి
–రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల
– ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో యుగపురుషుని జయంతి
సాక్షి, రాజమహేంద్రవరం : సమాజంలో ముఢనమ్మకాలు అధికంగా ఉన్న రోజులలోనే మహిళల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కొనియాడారు. ఆదివారం కందుకూరి 170వ జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో కందుకూరి జన్మగృహంలో వేడుకలు నిర్వహించారు. సమితి అధ్యక్షురాలు, 9వ డివిజన్ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుల మాట్లాడుతూ యుగపురుషుడు కందుకూరి జన్మించిన నగరంలో పుట్టడం అదృష్టమన్నారు. ఆయన తన యావదాస్తిని ప్రజల కోసం వెచ్చించారని, ఆ ఆస్తులు ఆయన ఆశయాలకు ఉపయోగపడేలా అందరం కృషి చేయాలని కోరారు. ఆయన చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పురమందిరం ట్రస్టు బోర్టు మాజీ కార్యదర్శి యాతగిరి శ్రీరామ నరసింహారావు మాట్లాడుతూ ఆనాడు కందుకూరి తలపెట్టిన వితంతు బాల్య వివాహానికి స్థానికులు ఎవ్వరూ మద్దతు తెలపలేదన్నారు. కందుకూరి భార్య రాజ్యలక్ష్మి ఒక్కరే గోదావరికి వెళ్లి 20 బిందెల నీరు తెచ్చి వంట చేశారని పేర్కొన్నారు. కందుకూరి జయంతి సందర్భంగా ఆయన మహిళలు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ పలువురు మహిళలు, మహిళా కార్పొరేటర్లకు కోసూరి చండీప్రియ సారె, తాంబూలం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇచ్చారు. అంతకు ముందు కందుకూరి దంపతుల చిత్రపటాలకు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రెడ్డి పార్వతి, జి.మాధవీలత, కె.ఈశ్వరి, మజ్జి నూకరత్నం, మాటూరి రంగారావు(బేబీరావు), బీసీ సంఘం నేత మజ్జి అప్పారావు, పెద్దిరెట్ల శ్రీనివాస్, అధికారులు వెంకటరత్నం, ఎస్.వెంకటరావు, మూసా తదితరులు పాల్గొన్నారు.